పాడేరు, న్యూస్‌లైన్ : అటవీ అభివృద్ధి సంస్థ ఆధీనంలోని మినుములూరు ఎస్టేట్‌లోని కాఫీ కార్మికులకు కూలీ పనులు కరువ య్యాయి. రెండు నెలల నుంచి యాజమాన్యం ఎలాంటి పనులు చూపకపోవడంతో కార్మికులంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 3 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న కాఫీ తోటల్లో పనులపై ఆధారపడి జీవిస్తున్న కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కాఫీ పండ్ల సీజన్ ప్రారంభానికి ముందు సెప్టెంబర్ నెల నుంచే కాఫీ తోటల్లో పనులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. కాఫీ తోటల్లో సస్యరక్షణ పనులతో బిజీగా ఉండాల్సిన కార్మికులంతా పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. తమకు పనులు కల్పించాలని రెండు నెలల నుంచి అధికారులను వేడుకుంటున్న ఫలితం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఏటా అక్టోబర్ నెల నుంచే కాఫీ పండ్ల సేకరణ చేపట్టేవారమని, ఈ ఏడాది కాఫీ కాయలు పక్వానికి రాకపోవడంతో పనులు లేకుండా పోయాయని కార్మికులు వాపోతున్నారు.
వంగసార, రొంపులి, ఆర్‌వీ నగర్ కాఫీ తోటల్లో ఇటీవలే కార్మికులకు పనులు కల్పించారు. మినుములూరు ఎస్టేట్‌లో పండ్లు పక్వానికి రాలేదన్న కారణం చూపి పనులు కల్పించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కాఫీ తోటలకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ పనులు కూడా కల్పించడం లేదని చెబుతున్నారు. కనీసం తోటల్లో చీమల మందు చల్లే పనులు కూడా కల్పించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తిండి గింజలకు కూడా అవస్థలు పడుతున్నప్పటికీ ఏపీఎఫ్‌డీసీ యాజమాన్యం పట్టించుకోకపోవడం అన్యాయమని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన యాజమాన్యం స్పందించి తోటల్లో కూలీ పనులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాలనీలో అన్నీ సమస్యలే..
మినుములూరు కాఫీ కాలనీలో కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మిక సంఘం నేతలు కాంతమ్మ, భీమాలమ్మ తెలిపారు. గృహాలు శిథిలావస్థకు చేరుకున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. వీధి లైట్లు లేకపోవడంతో చీకటిపడితే ఇంటినుంచి బయటకు రావడానికి భయపడుతున్నాని చెప్పారు. అటవీ ప్రాంతం కావడంతో తరచూ విషసర్పాలు ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయని తెలిపారు. కనీస సదుపాయాలు కల్పించాలని వేడుకుంటున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.
కాఫీ కార్మికుల ఆకలి కేకలు
Published Wed, Nov 20 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement