అయ్యో.. ఆయకట్టు | Coflicts Between Farmers For Water Supply | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఆయకట్టు

Published Fri, Nov 2 2018 11:12 AM | Last Updated on Fri, Nov 2 2018 11:12 AM

Coflicts Between Farmers For Water Supply - Sakshi

పిడుగురాళ్ల మండలంలో నీళ్ల కోసం ఆకురాజుపల్లి మేజర్‌ వద్ద వాగ్వాదానికి దిగిన రైతులు

నాగార్జున సాగర్‌ కుడికాలువ ఆయకట్టుకు నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌లకు ఈ ఏడాది పుష్కలంగా నీరు వచ్చి చేరినా కృష్ణానది యాజమాన్య బోర్డు కేటాయించిన నీటి వాటా మాత్రం తక్కువగా ఉంది. నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఏ పంట వేసుకున్నా నీరిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటించారు. ఇప్పుడు సరిపడా నీటి కేటాయింపు సాధించడంలో మాత్రం విఫలమయ్యారు. తీవ్ర వర్షాభావం ఎండిన పంటలను చూసి ఆవేదన చెందుతున్న రైతులకు.. ప్రభుత్వ అసమర్థత కన్నీరు పెట్టిస్తోంది.

సాక్షి, అమరావతి బ్యూరో: ఎన్‌ఎస్పీ పరిధిలో సాగు, తాగు నీటి అవసరాల కోసం 132 టీఎంసీలు అవసరమని నీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపినా.. కేవలం 91.87 టీఎంసీలకు మాత్రమే కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతిచ్చింది.

ఉన్న నీటిని మళ్లించుకున్న టీడీపీ నేతలు
ఇప్పటి వరకు ఉన్న నీటిని కొంత మంది అధికార పార్టీ సీనియర్‌ నేతలు అవసరం లేకున్నా విడుదల చేయించుకున్నారు. చివరి ఆయకట్టు రైతులకు అన్యాయం చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లో 570.70 అడుగులు అంటే 258.33 టీఎంసీలు, శ్రీశైలం రిజర్వాయర్‌లో 855.70 అడుగులు అంటే 93.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది సాగు నీటికి ఢోకా లేదనే ఉద్దేశంతో సాగు పెట్టుబడులు ఎకరాకు రూ.10 వేలు అదనంగా పెరిగినా రైతులు ముందడుగు వేశారు. అయితే వర్షాభావం కారణంగా ప్రస్తుతం పంటలు ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో సాగర్‌ నీరొస్తాయని ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో సాగులో ఉన్న కంది, పత్తి పంటలను దున్ని మాగాణి వేయడానికి రైతులు ఆందోళనలో చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న నీటితోనే అధికారులు వారబందీ ఏర్పాటు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

గతంలో కేటాయింపులు ఇలా..
2014–15లో మాగాణి పంటలు 2.64 లక్షల ఎకరాలు, ఆరుతడి పంటలు 4.29 లక్షల ఎకరాలు సాగయ్యాయి. దీని కోసం 159 టీఎంసీల నీటిని కేటాయించారు. నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లో తగినంత నీరు లేకపోవడంతో 2016–17లో 58.77 టీఎంసీల నీటిని విడుదల చేశారు. 2017–18లో 22 వేల ఎకరాల్లో వరి, 6.22 లక్షల ఎకరాల్లో ఆరు తడి పంటలకు సాగు నీరు ఇచ్చేందుకు వీలుగా 89.90 టీఎంసీల నీటిని వినియోగించారు. ఈ ఏడాది  2018–19లో 2.49 లక్షల ఎకరాల్లో మాగాణి, 4.24 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటకు సాగు, తాగు నీటి కోసం కేవలం 91.87 టీఎంసీలు మాత్రమే కేటాయించడం గమనార్హం. గత ఏడాదితో పోల్చితే అదనంగా కేవలం 1.97 టీఎంసీలు విదిల్చారు.

జిల్లాకు 22 టీఎంసీలే..
కృష్ణా బోర్డు కేటాయింపుల్లో గుంటూరు జిల్లాకు 22 టీఎంసీలు, ప్రకాశం జిల్లాకు 14 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం కేటాయించారు. నాలుగేళ్లుగా ఎన్‌ఎస్పీ ఆయకట్టు పరిధిలో మాగాణి పంటలు పండక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది ప్రభుత్వ హామీతో వరి సాగు చేపట్టిన రైతులకు ప్రస్తుత కేటాయింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఎస్పీ ఎడమ కాలువ పరిధిలో మూడేళ్లుగా వరి పంటకు నీరిస్తోంది. ఇక్కడి ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నా పంటలకు అందించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైతులకు తీవ్ర ఆవేదన మిగిలిస్తోంది.

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో రైతు నిరసన ర్యాలీ నేడు
గుంటూరు(పట్నంబజారు): నాలుగేళ్లుగా వినుకొండలో మంచినీటి సమస్యతో ప్రజలు విలవిలలాడిపోతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వినుకొండ నియోకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. దీంతోపాటు సాగు నీటి సమస్య ఉద్ధృతమైందని, ఈ సమస్యల పరిష్కారం కోరుతూ నేడు రైతు నిరసన ర్యాలీ చేపట్టనున్నామని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాగర్‌లో సమృద్ధిగా నీరున్నా..పొలాలకు విడుదల చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఇవన్నీ పట్టకుండా గుంటూరులో కూర్చుని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. నేటి ర్యాలీకి నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తలు కాసు మహేష్‌రెడ్డి, విడదల రజని హాజరు కానున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement