ఎవరికి వారే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది తామే అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించాలనుకున్నారు. అయితే దీనికి ఆదిలోనే అవాంతరం ఏర్పడింది. గ్రూప్ విభేదాలతో నేతలు ఎవరికి వారే సం బురాలు చేసుకుంటున్నారు. జిల్లాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ వేర్వేరు కార్యక్రమాలకు తెరతీశారు. ఇద్దరు నేతల అనుచరులు సైతం వేర్వేరుగా సంబురాలు చేసుకున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ విభేదాలకు ఇది తాజా ఉదాహరణ.
2009 ఎన్నికల తర్వాత
అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు జిల్లా కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తోంది. జిల్లాలోని తొమ్మి ది నియోజకవర్గాలపైనా ప్రభావం చూపుతోంది. 2009 ఎన్నికలలో అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డి.శ్రీనివాస్ ఓడిపోయారు. జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున బోధన్ నుంచి పోటీచేసిన సుదర్శన్‌రెడ్డి ఒక్కరే విజయం సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు చోటు లభించింది.
తర్వాతి పరిస్థితులలో జిల్లాపై పట్టు నిలుపుకోవడానికి ఒకరు, పట్టు సాధించడం కోసం మరొకరు ప్రయత్నించడంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. మరోవైపు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పార్టీలో ప్రాబల్యా న్ని చాటుకునేందుకు యత్నిస్తూ వస్తున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాలాట నెలకొంది. ఇది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. కార్యకర్తలను ఆయోమయానికి గురి చేస్తోంది.
సంబురాలలోనూ కలవని నేతలు
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా నిర్వహించే ఉత్సవాల కోసమూ అగ్రనేతలు కలిసి సాగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా జిల్లాలో సంబురాలు ఉమ్మడిగా, ఘనంగా నిర్వహించాలని అగ్రనేతలు పిలుపునిచ్చారు. పార్టీ హైకమాండ్ ఆదేశించిన మరుసటి రోజే సంబురాలకు సిద్ధమైన ఇద్దరు నేతలు హైదరాబాద్‌లో వేర్వేరుగా ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు.
నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో డి.శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మాట్లాడారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి సైతం బోధన్ నియోజకవర్గం ముఖ్య నేతలతో పాటు నిజామాబాద్‌కు చెందిన కేడర్ తో హైదరాబాద్‌లో మాట్లాడారు. బుధవారం నిజామాబాద్ నుంచి బోధన్ వరకు మంత్రి ర్యాలీ తీశారు. విజయోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. డీఎస్ వచ్చే నెల రెండున నిజామాబాద్ రానున్నారు. ఆ రోజు సంబురాలు జరుపుకునేందుకు డీఎస్ వర్గం ఏర్పాట్లు చేస్తోంది.
ఐక్యత కష్టమే!
తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలలో ఇప్పటికే ఉమ్మడిగా సదస్సులు నిర్వహించగా, జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల కారణంగా అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఇప్పటికే ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడినట్లే భావిస్తున్నారు. ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ రెండు రోజుల క్రితం బాల్కొండ నియోజకవర్గంలో సంబురాలు చేసుకోగా, మంత్రి సుదర్శన్‌రెడ్డి బుధవారం నిర్వహించారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొందరు ఆ సంబురాల ఊసే ఎత్తడం లేదన్న చర్చ పార్టీ వర్గాలలో సాగుతోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ శాసనసభాపతి సురేశ్‌రెడ్డిలు తెలంగాణ సంబురాలపై స్పందించకపోవడం పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తోంది. పరిస్థితులను గమనిస్తున్నవారు కాంగ్రెస్‌లో ఐక్యత కష్టమే అని పేర్కొంటున్నారు.