- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వేర్వేరు
- రాష్ట్రస్థాయి యూనివర్సిటీలకు మరొకటి
- సాక్షి కథనాలతో స్పందించిన గవర్నర్
- పాత సిఫార్సులు రద్దు
వర్సిటీ ఈసీల ఎంపికకు కొలీజియంలు
Published Wed, Apr 16 2014 2:15 AM | Last Updated on Wed, Sep 5 2018 8:33 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసీలు లేని 19 యూనివర్సిటీలకు పాలక మండళ్లను నియమించేందుకు కొత్త కొలీజియంలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా రెండు కొలీజియంలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్-ఈసీ) ఏర్పాటుకు వేరుగా మరొకటి మొత్తం మూడు కొలీజియంల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. గతంలో వర్సిటీ ఈసీల సభ్యులుగా కొలీజియం సిఫారసు చేసిన పేర్లను ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళ మంత్రి భర్త పేరు, మరో ఎమ్మెల్యే కొడుకు, ఇంకో ఎమ్మెల్యే తమ్ముడు.. ఇలా అర్హత లేని, పలుకుబడి కలిగిన వారి పేర్లను చేర్చడం పట్ల ‘వర్సిటీలకు పాలక మండళ్లేవీ?’, ‘పరపతి ఉంటే చాలు యూని వర్సిటీ ఈసీ మెంబర్’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనాలపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పందించారు. గవర్నర్ ఆదేశాల మేరకు వర్సిటీల వారీగా కొలీజియం సిఫారసు చేసిన పేర్లు, సీఎం, డిప్యూటీ సీఎంలు మార్చిన పేర్లు అన్నిటితో ప్రభుత్వం ఒక నివేదిక పంపింది. దీంతో ఆ నియామకాలన్నింటినీ గవర్నర్ రద్దుచేసి కొత్త కొలీజియంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర విభజనతో వేర్వేరు కొలీజియంలు..
కాగా, రెండు రాష్ట్రాలకు వేర్వేరు కొలీజియంలను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. రెండు మూడు రోజుల్లో ఉన్నతవిద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, వైస్‌ఛైర్మన్ విజయప్రకాశ్, కార్యదర్శి సతీశ్‌రెడ్డి, డిప్యూటీ డెరైక్టర్ కృష్ణమూర్తి తదితరులు సమావేశమై కొలిజీయంలలో నియమించే వారిని పేర్లను ఖరారు చేస్తారు. తెలంగాణ కొలీజియంలో తెలంగాణ ప్రొఫెసర్లు, ఆంధ్రప్రదేశ్ కొలీజియంలో అక్కడి ప్రొఫెసర్లు ఉండనున్నారు. రాష్ట్రస్థాయి వర్సిటీల కొలీజియంకు ఛైర్మన్‌గా ఇతర రాష్ట్రాల వారిని నియమిస్తారు. ఒక్కో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో 14 మంది ఉంటారు. వారిలో అధికారులు, ప్రొఫెసర్లు కాకుండా ఇతర రంగాలకు చెందిన నలుగురిని ఈ కొలీజియం ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఈసీలు లేని వర్సిటీలు ఇవే..
యోగివేమన (కడప), ఆదికవి నన్నయ (రాజమండ్రి), తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్), ఆంధ్ర యూనివర్సిటీ(విశాఖపట్నం), శ్రీవేంకటేశ్వర (తిరుపతి), కాకతీయ (వరంగల్), తెలంగాణ విశ్వవిద్యాలయం (నిజామాబాద్) నాగార్జున (గుం టూరు), శ్రీకృష్ణదేవరాయ (అనంతపూర్), శాతవాహన (కరీంనగర్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (శ్రీకాకుళం), కృష్ణా (మచిలీపట్నం), విక్రమసింహపురి (నెల్లూరు), రాయలసీమ (కర్నూలు), జేఎన్‌టీయూ (కాకినాడ), జేఎన్‌టీయూ (అనంతపూర్), జేఎన్‌ఏయూఎఫ్‌ఏ (హైదరాబాద్), బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరాబాద్), శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం (తిరుపతి)లకు ఈసీలను నియమించాల్సి ఉంది.
Advertisement
Advertisement