వైస్ చాన్స్‌లర్ల సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో తుమ్మల పాపిరెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రంజీవ్ ఆర్ ఆచార్య తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘యూనివర్సిటీల్లో జరిగే నియామకాల్లో అవినీతి, అక్రమాలను సహించేది లేదు.. ఎక్కడైనా అక్రమాలు జరిగితే సంబంధిత వైస్ చాన్స్‌లర్లదే బాధ్యత’ అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టం చేశారు. నిర్ణీత కాల వ్యవధిలో, పారదర్శకంగా నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్రంలోని వర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో చాన్స్‌లర్ హోదాలో తొలిసారి గవర్నర్ సమీక్ష నిర్వహిం చారు. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీ క్యాంపస్‌ల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ వర్సిటీలు, తెలంగాణ విద్యను దేశంలో నంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే 6 నెలల్లో జరిగే సమావేశంలో కార్యక్రమాల అమలుపై యాక్షన్ టేకెన్ రిపోర్టులతో రావాలని ఆదేశించారు.
6 నెలల్లో చేపట్టాల్సిన 10 ప్రధాన చర్యలు
- వర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీలు, కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో పక్కాగా అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలి.
- ప్రతి వర్సిటీ, వాటి అనుబంధ కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు విధానం అమలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరులో పార దర్శకత తీసుకురావాలి.
- 2017–18 సంవత్సరానికి వర్సిటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 419 కోట్లను కేటాయించింది. ఆ నిధులను వినియోగించుకోడానికి ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేసుకొని పనులను చేపట్టాలి.
- వర్సిటీల్లో 1,061 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. వీటి భర్తీకి కమిటీ వేశాం. ఒకటి, రెండు రోజుల్లో నివేదిక రాగానే ప్రక్రియ ప్రారంభించి 6 నెలల్లోగా పూర్తి చేయడం. ఇందులో గవర్నర్ సూచనల మేరకు చర్యలు చేపట్టాలి.
- సీరియస్‌గా పరిశోధన చేసే విద్యార్థులకే వర్సిటీల్లో పీహెచ్‌డీకి అవకాశం కల్పించాలి. గడువులోనే పీహెచ్‌డీ పూర్తి చేసేలా చూడాలి. కాలక్షేపం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. పీహెచ్‌డీలకు సంబంధించి ముగ్గురు వీసీలతో వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు యూనిఫామ్ పాలసీ తెచ్చి అమలు చేయాలి.
- సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్సిటీలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. అన్ని సర్వీసులను ఆన్‌లైన్ చేయాలి.
- వర్సిటీల్లోని విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభించేలా దృష్టి పెట్టాలి. వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలి.
- వర్సిటీల వద్ద ఉన్న సేవల ద్వారా, నైపుణ్యాల ద్వారా వనరులు సమీకరించాలి. స్వయం సమృద్ధి సాధించాలి.
- విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లోని సీట్లు, చేరుతున్న విద్యార్థుల సంఖ్యపై సమీక్ష. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సీట్లు ఉండేలా చూసుకోవాలి.
- వర్సిటీల్లో పనిచేసే అధ్యాపకులకు ఎప్పటికప్పుడు ఇన్ సర్వీసు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
ప్రవేశాల్లో జాతీయ సగటు కంటే పైనే..
వచ్చే 6 నెలల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టులతో గవర్నర్ అధ్యక్షతన వీసీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని కడియం చెప్పారు. విద్యపై కేంద్ర మానవ వనరుల శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో ప్రవేశాలు జాతీయ సగటు కంటే పైస్థానంలో ఉన్నాయ న్నారు. వర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఆధార్ ఆధారిత అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని, దీన్ని కేంద్రమూ కొనియాడిందని చెప్పారు. గవర్నర్ సలహా మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో జులైలోనే అకడమిక్ ఇయర్ ప్రారంభిస్తామని వెల్లడించారు. 6 నెలల్లో వర్సిటీల్లోని సర్వీసులను ఆన్‌లైన్ చేస్తామన్నారు. వర్సిటీ హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ లేకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 10 అంశాల్లో పక్కా ప్రణాళికతో వచ్చే 6 నెలల్లో తగిన చర్యలు చేపడతామని వివరించారు. కాగా, సమావేశానికి ముందు అంబేడ్కర్ వర్సిటీ ఆవరణలో గవర్నర్ నరసింహన్ మొక్కను నాటారు. అనంతరం ఉన్నత విద్యా మండలి నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment