కుప్పకూలిన టమోటా ధర
=రైతుకు దక్కేది కిలోకు మూడు రూపాయలే
=ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి
=కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన
నూజివీడు, న్యూస్‌లైన్ : నెలరోజుల క్రితం వరకు కిలో రూ.30 వరకు పలికిన టమోటా ధర ఒక్కసారిగా కుప్పకూలడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు కిలోకు మూడు రూపాయలు కూడా దక్కడం లేదని, దీనివల్ల కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు బాగా ఉంటాయని అప్పులు చేసి మరీ సాగుచేస్తే దిగుబడి వచ్చే సమయానికి దారుణంగా పతనమవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పులు ఎలా తీరుతాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.
నూజివీడు ప్రాంతంలో సిద్ధార్థనగర్, నర్సపేట, లైన్‌తండా, వెంకటాయపాలెం, హనుమంతులగూడెం, బత్తులవారిగూడెం, సుంకొల్లు, జంగంగూడెం, దేవరగుంట తదితర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో టమోటా సాగు చేశారు. రోజుకు దాదాపు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ పరిస్థితుల్లో టమాటాకు ఈ ప్రాంతంలో మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు రైతుబజారులోని వ్యాపారులకు వేసినన్ని వేసి, మిగిలినవి కమీషన్ వ్యాపారులకు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు.
మరికొంత ధర ఉంటే గుడివాడ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించి వస్తారు. ప్రస్తుతం ధర పడిపోవడంతో అక్కడి వరకు ఉపయోగం ఉండే అవకాశం లేక కమీషన్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. పంట సాగుచేసినందుకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అయిన నేపథ్యంలో ధర దిగజారడంతో పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం టమోటాకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే లాభసాటిగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు.