ఉద్యమ పథం | Collecterate success of the siege | Sakshi
Sakshi News home page

ఉద్యమ పథం

Published Wed, Jun 24 2015 1:51 AM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

ఉద్యమ పథం - Sakshi

ఉద్యమ పథం

- రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన
- 25న కలెక్టరేట్ ముట్టడికి తరలిరావాలి
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
అనకాపల్లి రూరల్ :
ప్రభుత్వ రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై ఈ నెల 25న చేపట్టే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని కోరారు.  రూరల్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద ఆందోళన చేపడుతున్నట్టు తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులవుతున్నా ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేకపోయిందన్నారు.

రుణప్రణాళిక విషయంలోనూ స్పష్టత లేకపోవడం శోచనీయమన్నారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. విత్తనాల కోసం మండల కేంద్రాల్లో రోజూ అష్టకష్టాలకు గురవుతున్నారన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే మంత్రులెవ్వరూ మాట్లాడలేదన్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై సీఎం రాజీనామా చేయాలన్నారు. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ప్రజా, రైతు సమస్యలు గాలికి వదిలేశారన్నారు. ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ అన్నదాతకు ఆపద రానీయమని చెబుతున్న మంత్రులు అడిగిన విత్తనాలు సరఫరా చేయలేని దయనీయ స్థితిలో ఉన్నారన్నారు. రైతులతోపాటు కౌలు రైతులకు రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలకు అన్నీ కష్టాలు కడగండ్లే అన్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి సెక్షన్ 8, ఫోన్ టాపింగ్ వంటి అంశాలతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తవ్వకాలకు ప్రయత్నించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. బాక్సైట్ జోలికొస్తే గిరిజనుల తడాఖా చూపిస్తామన్నారు. అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రగడనాగేశ్వరరావు, చెంగల వెంకటరావు, అదీప్‌రాజ్‌లు సమావేశంలో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement