సాక్షి, కాకినాడ: ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ ఆసుపత్రులు బేఖాతరు చేస్తే ఉపేక్షించేది లేదని.. గుర్తింపు రద్దు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి హెచ్చరించారు. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం కాకినాడ ఎస్ఈజడ్ లోని పాల్స్ ప్లస్ పరిశ్రమలో తయారు చేసిన పిపిఈ కిట్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్‌లో విధులు నిర్వహించే పోలీసులు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్సనందించే వైద్యులు, సిబ్బందికి పిపిఈ కిట్స్ అవసరం ఉందని పేర్కొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శంఖవరం మండలం కత్తిపూడిలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యిందని తెలిపారు. విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పది రోజుల క్రితం కత్తిపూడికి వచ్చారని.. కరోనా లక్షణాలు ఉన్నప్పటికి గోప్యంగా ఉంచి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. విశాఖ కొవిడ్ ఆసుపత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు కాంటాక్ట్స్ ను రెవెన్యూ, వైద్యాధికారులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు చికిత్స అందించిన ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment