నీతూప్రసాద్..తెలంగాణకు..
కలెక్టర్ నీతూప్రసాద్ బదిలీపై గత నాలుగు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఐఏఎస్‌ల విభజనకు సంబంధించిన ఫైల్‌ను ప్రధాని నరేంద్రమోదీ గత నెల 25న ఆమోదించారు. ఆ కేటాయింపుల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి ఫైల్‌పై సంతకం చేశారు. ఆమేరకు చీఫ్ సెక్రటరీ కృష్ణారావు ఆదివారం తెలంగాణకు కేటాయించిన అఖిల భారత సర్వీస్ అధికారులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే తెలంగాణ కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ నీతూప్రసాద్‌ను తెలంగాణ కు కేటాయించడంతో ఆమె సోమవారం ఉదయం రిలీవ్ కానున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ వెళ్లి తెలంగాణ సర్కారుకు రిపోర్టు చేయనున్నారు.
కాకినాడ సిటీ :ఐఏఎస్ 2001 బ్యాచ్‌కు చెందిన కలెక్టర్ నీతూప్రసాద్ జిల్లాకు 2012 ఫిబ్రవరి 25న జిల్లాకు వచ్చారు. రెండు సంవత్సరాల పది నెలల పది రోజులు ఇక్కడ పనిచేశారు. గతంలో ఈమె భద్రాచలం సబ్ కలెక్టర్‌గా, వరంగల్ కమిషనర్‌గా, టూరిజం శాఖ అధికారిగా పనిచేశారు. తరువాత నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తూ కలెక్టర్‌గా పదోన్నతిపై జిల్లాకు 2012లో వచ్చారు. ఆమె జిల్లాకు తొలి మహిళా కలెక్టర్ కావడం విశేషం. కలెక్టర్‌గా నీతూ ప్రసాద్ ప్రకృతి విపత్తుల సందర్భాల్లో, సార్వత్రిక ఎన్నికలు, పంచాయతీ, జిల్లాపరిషత్ ఎన్నికల నిర్వహణలో సమర్థంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ కు వెళ్ళేందుకు మొగ్గు చూపారు. అయితే ఐపీఎస్ అధికారి అయిన ఆమె భర్త రాజేష్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించడంతో పునరాలోచనలో పడ్డారు. అయినా చివరకు తెలంగాణ కు వెళ్ళడం అనివార్యమైంది.
ఎవరు రానున్నారో?
కలెక్టర్ నీతూప్రసాద్‌ను తెలంగాణకు వెళ్లనుండడంతో ఇన్‌చార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజును నియమితులయ్యారు. నాలుగు రోజుల సెలవుపై వెళ్ళిన జేసీ సోమవారం తిరిగి రానున్నారు. ఇదిలా ఉండగా కొత్త కలెక్టర్‌గా ఎవరు వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సెర్ఫ్ సీఈఓ హెచ్.అరుణ్‌కుమార్, శ్రీకాకుళం కలెక్టర్ ఎంఎం నాయక్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అరుణ్‌కుమార్ పేరు దాదాపు ఖరారైందని తెలుస్తుండగా జిల్లాకు చెందిన ఒక మంత్రి నాయక్‌వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ శ్రీనివాసరాజు, గ్రేటర్ హైదరాబాద్ అదనపు కమిషనర్ అహ్మద్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి.