- చిత్తూరు పాతబస్టాండ్లో చెత్త మోసిన కలెక్టర్
- కార్మికులు సమ్మె వీడాలని విజ్ఞప్తి
- స్పందించి విధులకు హాజరైన కార్మికులు
పది రోజులకు పైగా మునిసిపల్ కార్మికులు చెత్త తీయకపోవడంతో పాలకులు, జిల్లా అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే చిత్తూరు నగర మేయర్, కార్పొరేటర్లు రోడ్లపై చెత్త తీయగా... సోమవారం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సైతం చెత్త తీశారు.
చిత్తూరు (అర్బన్) :
చిత్తూరులోని పాత బస్టాండులో పేరుకుపోయిన చెత్తను కలెక్టర్, మేయర్ కఠారి అనురాధ తదితరులు శుభ్రం చేశారు. కలెక్టర్ స్వయంగా చెత్తను ట్రాక్టర్‌కు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలంతా చైతన్యంతో ముందుకు వచ్చి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ‘మన చెత్తను మనమే తీద్దాం’ నినాదంతో ప్రజలు చెత్త చెదారాన్ని స్థానికంగా ఓ ప్రదేశంలో నిల్వ చేసినట్లయితే వాహనాల్లో వాటిని తొలగించడానికి అధికారులు చొరవ చూపుతారన్నారు. జిల్లాలోని ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లావ్యాప్తంగా సమ్మె చేస్తున్న మునిసిపల్ కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చొరవ చూపిస్తామన్నారు. కార్మికులు సమ్మె వీడని పక్షంలో మునిసిపల్ కమిషనర్లు వెంటనే ప్రైవేటు సిబ్బందిని తెప్పించుకుని యంత్రాలు, ఇతర పద్ధతుల ద్వారా యుద్ధప్రాతిపదికన చెత్తను తొలగించాలన్నారు. ఆర్డీవోలు ఇందులో పూర్తిగా కల్పించుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వాస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కలెక్టర్ విన్నపానికి చిత్తూరు కార్పొరేషన్ కార్మికులు స్పందిస్తూ విధులకు హాజరయ్యారు. నగరంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. చిత్తూరు ఆర్డీవో పెంచల్ కిషోర్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కఠారి మోహన్, కార్పొరేటర్లు కంద, రాణి, గుణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.