సాక్షి, రంగారెడ్డి జిల్లా : పౌర సేవలందించడంలో తహసీల్దార్లు అలసత్వం వహిస్తున్నారని కలెక్టర్ బి.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ల పనితీరుపై కలెక్టరేట్‌కు పలు ఫిర్యాదులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే ఆర్జీలను త్వరితంగా పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేయాలని, అలసత్వం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో మీసేవ, భూకేటాయింపులు, పరిరక్షణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లతో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలానగర్, కుత్బుల్లాపూర్, కీసర మండలాల్లో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ వెనుకబడి ఉందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 50యూనిట్ల లోపు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోందని, ఇందుకోసం వారికి కులధ్రువీకరణ పత్రం అవసరమన్నారు.
ఈ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేసేందుకు తహసీల్దార్లు శ్రద్ధ చూపాల న్నారు. జిల్లాలో 78 ఎకరాల ప్రభుత్వ భూమికి ప్రహరీలు నిర్మిస్తున్నామని, సంబంధిత జాయింట్ కలెక్టర్, భూపరిరక్షణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లదే ఈ బాధ్యత అని అన్నారు. మార్చి నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏడో విడత భూపంపిణీకి సంబంధించి క్షేత్ర పరిశీలన పూర్తిచేయని బషీరాబాద్ తహసీల్దార్‌పై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఓటర్ల నమోదుకు సంబంధించి అర్హులను గుర్తించి వివరాలు నమోదు చేయాలని, పొరపాట్లు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, డీఆర్వో వెంకటేశ్వర్లు తదిత రులు పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
Published Fri, Jan 10 2014 2:57 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement