కలెక్టర్‌గారి తీరు మారదా?
సమయపాలన పాటించని జిల్లా కలెక్టర్
పడిగాపులతో అధికారుల తిప్పలు
మహిళా అధికారుల కష్టాలు వర్ణనాతీతం
చిత్తూరు: ‘‘కలెక్టర్ సమీక్ష అంట.. ఎప్పటికి ఇంటికొస్తామో మాకే తెలియదు. అన్నం వండుకుని తినేసి పడుకోండి..’’ అంటూ ఓ అధికారిణి ఇంటికి పంపిన ఫోన్ ఎస్‌ఎంఎస్ ఇది.ఉదయం 11 గంటలకు మీటింగంటూ పిలిపిస్తారు.. మూడు గంటల వరకు ఆయనగారు రారు. ఎప్పుడొస్తారో తెలియక తిండితిప్పలు మాని కార్యాలయం చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వస్తోంది. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల బాధలు వర్ణనాతీతం. మాకు ఈ కర్మ ఏమిటి సార్.. ఓ జిల్లాస్థాయి అధికారి ఆవేదన ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత.
జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమీక్ష అంటేనే జిల్లా అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. సమయపాలన పాటించని కలెక్టర్ తీరుతో విసిగిపోతున్నామంటూ తలలు పట్టుకుని కుయ్యో.. మొర్రో అంటున్నారు. ఇది ఒకటి, రెండు రోజుల సమస్య కాదు.. నిత్యం ఇదే తంతు. ముందుగా ప్రకటించిన సమయానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమీక్షలు, సమావేశాలు నిర్వహించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా గురువారం జరిగిన ఘటన కూడా కలెక్టర్ సమయపాలన పాటించలేదనేందుకు తార్కాణంగా నిలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఉపఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. సమావేశానికి ఎన్నికల విధులకు సంబంధించిన అధికారులందరూ హాజరుకావాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటల నుంచే ఎన్నికల పరిశీలకుడితో పాటు, ఆర్డీవో, డెప్యూటీ కలెక్టర్, ఆ తరువాత స్థాయి అధికారులు దాదాపు వందమంది ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాల్ వద్ద ఎదురుచూశారు. మూడు కాదు 4 గంటలైనా కలెక్టర్ హాజరుకాలేదు. దీంతో 2.45 గంటలకే సమావేశానికి వచ్చిన ఒకరిద్దరు ఉన్నతాధికారులు వె ళ్లిపోయారు.
మిగిలిన అధికారులందరూ కలెక్టర్ కోసం పడిగాపులు కాశారు. ఏమీ అనలేని మిగిలిన అధికారులు బాధ దిగమింగుకుని వేచి చూశారు. మరోవైపు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల నేతల సమావేశానికి సైతం కలెక్టర్ హాజరుకావాల్సి ఉంది. కానీ ఈ సమావేశానికి కలెక్టర్ హాజరుకాలేదు. ఆ తరువాత సమావేశం 3 గంటలకు ఉంటుందని నేతలకు సమాచారం అందించారు. 3 గంటలకు కూడా కలెక్టర్ అటు రాజకీయ పార్టీ సమావేశానికి, ఇటు ఎన్నికల అధికారుల సమావేశానికిగానీ హాజరుకాలేదు. ఎన్నికల అధికారుల సమావేశానికి హాజరైన ఎన్నికల పరిశీలకులు విసిగివేశారి కలెక్టర్‌పై మండిపడ్డట్లు సమాచారం. దీంతో ఎట్టకేలకు 4.45 గంటలకు కలెక్టర్ అధికారుల సమావేశానికి హాజరయ్యారు.
రాజకీయ పార్టీల సమావేశం వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఉన్నతాధికారుల సమావేశాలు ఏదో ఒక రోజు ఒక గంట అటో ఇటో జరగడం సర్వసాధారణం. అయితే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమావేశాలు తరచూ ఆలస్యంగా జరుగుతున్నాయని, చెప్పుకోలేని బాధతో సతమతవుతున్నామని పలువురు అధికారులు ‘సాక్షి’తో వాపోయూరు.. తమ బాధలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారి తీరు మారితే బాగుంటుందని వారంతా ఆకాంక్షిస్తున్నారు.