రంగు పడుద్ది | Color paduddi | Sakshi
Sakshi News home page

రంగు పడుద్ది

Published Wed, Oct 15 2014 2:49 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

Color paduddi

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందజేసే రుణాల విషయంలో రాజకీయం చోటు చేసుకుంటోంది. గత  ప్రభుత్వం రుణ లక్ష్యంతోపాటు ఆయా వర్గాలకు గుదిబండగా మారే 101 జీఓను తెచ్చింది. ఈ జీఓతోపాటు అనేక ఆంక్షలను విధించింది.  అర్హులను గుర్తించడానికి ఒక కమిటీని నియమించింది. అన్ని గండాలను అధిగమించుకుని అర్హులుగా మిగిలిన వారికి ప్రభుత్వం అరకొరగా సబ్సిడీ మంజూరు చేయడంతో అతి తక్కువ మంది మాత్రమే లబ్ధిపొందగలిగారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారు మళ్లీ  పింఛన్ల కమిటీతో ఆమోదం పొందాలని మెలిక పెట్టింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రుణాలకు పచ్చరంగు పులుముకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.     
 
 కడప రూరల్:   గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013-14లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజి రుణాలను 1284 యూనిట్లకు గాను 2437 మందికి అందివ్వాలని, ఇందుకోసం సబ్సిడీ కింద రూ.9.22కోట్లను  కేటాయించింది. నాటి పాలకులు సబ్సిడీ పెంచడంతో అర్హులు సంతోషం వ్యక్తంచేశారు. ఆ సంతోషం ముగియకముందే ప్రభుత్వం అర్హుల నడ్డి విరిచేలా 101 జీఓను తెచ్చింది.

అర్హులను ఎంపిక చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అధికార పార్టీకి చెందిన వారు ఉండడం, కమిటీ సభ్యులు అధికార పార్టీ కనుసన్నల సైగలతో పనిచేయడంతో అర్హులు ఆ కమిటీ నుంచి రుణమంజూరుకు అనుమతి పొందడానికి చాలా కష్టాలు పడ్డారు. 101 జీఓ రాకముందే దళిత వర్గాలకు చెందిన వారు రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. జీఓ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిలో వందలాది మంది అనర్హులుగా మిగిలారు. పైగా నాటి ప్రభుత్వం సబ్సిడీని సకాలంలో మంజూరు చేయకపోవడంతో 650 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. మిగిలిన అర్హులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు.

 101 యదాతథం :
 బడుగు, బలహీన వర్గాల రుణాలకు సంబంధించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 101 జీఓను ప్రవేశపెట్టడంతో ఆయా వర్గాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 101 జీఓను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత పాలకులు ఆ జీఓను యదాతథంగా అమలు చేయడంతోపాటు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ఈ జీఓ ప్రకారం దళిత వర్గాలు రుణం పొందాలంటే 21 నుంచి 45 సంవత్సరాలలోపు వయస్సు కలిగివుండాలి.

రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆ రేషన్‌కార్డులో ఒక్కరు మాత్రమే రుణానికి దరఖాస్తు చేసుకోవాలి. గడిచిన ఐదేళ్ల వరకు ఎలాంటి రుణం తీసుకోనివారై ఉండాలి. తాజాగా ఆధార్‌ను తప్పనిసరి చేశారు.  101 జీఓపై వచ్చిన ఆరోపణలు, ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఆ జీఓను తొలగిస్తుందని అందరూ భావించారు. ఆ జీఓను ప్రభుత్వం యదాతథం చేయడంతో అందరిలో అసంతృప్తి నెలకొంది.

 మైనర్ ఇరిగేషన్ లబ్ధిదారులకు కష్టకాలం :
  నిరుపేద దళిత రైతులు మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లను రుణం ద్వారా పొంది లబ్ధి పొందుతుంటారు. అయితే 101 జీఓ కారణంగా అర్హుల వయస్సు 21-45 సంవత్సరాల్లోపు ఉండాలి. అయితే దళితులకు సంబంధించిన భూములన్నీ 50 సంవత్సరాల పైబడి ఉన్నవారికే  ఎక్కువగా ఉన్నాయి. వారంతా మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించిన యూనిట్లను పొందలేకపోతున్నారు.

 2014-15కు 1897 యూనిట్ల లక్ష్యం :
 తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 1950 మంది లబ్ధిదారులకు బ్యాంకు లింకేజి క్రింద 1897 యూనిట్లను లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం రుణాలకు మొత్తం రూ.21కోట్లు అవసరం కాగా అందులో ప్రభుత్వ సబ్సిడీ వాటా రూ.12కోట్ల మేరకు ఉంది. ఈ రుణాల మంజూరుకు సంబంధించి అధికారులు మండల స్థాయిలో టార్గెట్లను కేటాయించడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ రుణాల మంజూరుకు డీసీసీ (డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ) ఆమోదం తెలపాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement