లారీ నుంచి సీ హారియర్‌ను దించుతున్న దృశ్యం
ఒకవైపు కురుసుర సబ్‌మెరైన్.. మరోవైపు టీయూ 142 ఎయిర్‌క్రాఫ్ట్.. విశాఖ సుందరి మెడలో కంఠాభరణం లాంటి బీచ్‌రోడ్డులో కలికితురాళ్లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు వాటి సరసన సీ హారియర్ యుద్ధ విమానం చేరబోతోంది.నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ హంస విమానవాహక యుద్ధనౌకలో గోవా కేంద్రంగా సుదీర్ఘ సేవలందించిన ఈ విమానం 2016లో విశ్రమించింది. ఇప్పుడు దాన్ని విశాఖ తీసుకొచ్చారు. టీయూ 142 యుద్ధ విమాన మూజియం పక్కనే దీన్నీ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు.
సాక్షి, విశాఖపట్నం: సుందర సాగరతీరంలో మరో యుద్ధ విమానం కొలువుదీరనుంది. ఇప్పటికే ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్ సందర్శకులను ఎంతగానో అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి సందర్శకుల మనసు దోచుకుంటోంది. సాగరతీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్ ఏరోస్పేస్ నుంచి కొనుగోలు చేసిన ఈ సీ హారియర్ నౌకాదళం ఏవియేషన్ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్‌ఎస్ హంస యుద్ధనౌకలో 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది. ఈ యుద్ద విమానాన్ని వీఎంఆర్‌డీఏ విశాఖపట్నం సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వీఎంఆర్‌డీఏ ఇంజినీర్లు ఈ విమానాన్ని గోవా నుంచి మంగళవారం లారీపై తీసుకొచ్చారు.
ప్రస్తుతం దీనిని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. త్వరలో అక్కడకు సమీపంలోని రాజీవ్ స్మృతిభవన్‌లో మ్యూజియంగా ఏర్పాటు చేయనున్నారు. మరో ఆరు నెలల్లో ఈ సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియంను అందుబాటులోకి తేవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాగరతీరంలో సీ హారియర్, ఇంటిగ్రెటెడ్ మ్యూజియం, అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌కు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో వీఎంఆర్‌డీఏ, టూరిజం, స్మార్ట్ సిటీ నిధులను వెచ్చిస్తున్నారు. త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని వీఎంఆర్‌డీఏ కమిషనర్ పి.బసంత్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment