సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాలో కాంగ్రెస్ ముఖ చిత్రం మారుతోంది. ఒక్కరొక్కరుగా ఇతర పార్టీల నేతలు చేరుతుండడంతో పార్టీలో కొత్త సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికేవర్గ విభేదాలు, గ్రూపులతో ముక్కలు చెక్కలుగా ఉన్న కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతర్గత కలహాలు మరింత పెచ్చరిల్లనున్నాయి. ఇటీవల వైఎస్సార్‌సీపీని వీడిన మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు పాత గూటికి చేరారు. సీఎం కిరణ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సురేఖ.. తమ రాజకీయ పుట్టినిల్లు, తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెసేనని అన్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి విజయరామారావు సైతం దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ హయాంలో కొండా దంపతులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. అప్పుడు సురేఖ మంత్రి పదవిలో ఉండటంతో పార్టీ జిల్లా శ్రేణుల్లోనూ వారి మాటే చెల్లుబాటయ్యేది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయం తారుమారైంది. జిల్లాలో పార్టీ ముఖ్యులే గ్రూపులుగా విడిపోయారు.
ఇప్పటివరకు కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య కలిసి కట్టుగా ఒకే వేదికను పంచుకున్న దాఖలాలు లేవు. ముందు నుంచీ కొండాకు వ్యతిరేకంగా ఉన్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్‌లో కీలక స్థాయికి ఎదిగారు. చీఫ్ విప్ పదవిలో ఉండడంతో గండ్ర.. పార్టీలో పట్టు సాధించారు. ముగ్గురు మంత్రులకు దీటుగా సొంత వర్గాన్ని నిలబెట్టుకున్నారు. దొంతి మాధవరెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పట్లో కొండా అనుచరుడిగా ముద్ర వేసుకున్న జంగా రాఘవరెడ్డి ఇటీవలే డీసీసీబీ అధ్యక్షునిగా గెలుపొందారు. సహకార ఎన్నికల్లో సొంత పార్టీలోనే మాధవరెడ్డికి వ్యతిరేకంగా పోటాపోటీ క్యాంపులు పెట్టి పీఠాన్ని దక్కించుకున్నారు. మరోవైపు ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు మాలోతు కవిత, శ్రీధర్, మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావులు ముఖ్య నేతలకు అంటీముట్టన్నట్లు ఉంటూ నియోజకవర్గాలకు పరిమితమయ్యారు.
గ్రూపులకు అతీతంగా డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రామసాయం రఘురాంరెడ్డి ఇటీవల జిల్లా రాజకీయాల్లో కేంద్ర బిందువయ్యారు. సీఎం సన్నిహితుడు కావటంతో హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీసు కేంద్రంగా చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో కొండా దంపతుల చేరికతో గ్రూపు రాజకీయాలు మలుపు తిరుగుతాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ముందుగా అడ్డుకున్న నేతలు ఆదరిస్తారా..? గతంతో పోలిస్తే పార్టీలో కొండా దంపతుల ప్రాబల్యం.. ప్రాధాన్యం పెరుగుతుందా..? తగ్గుతుందా..? ఇప్పటికే ముగ్గురు మంత్రులు.. ఆరు గ్రూపులుగా చీలిన జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరింత ముదురుతాయా..? వేచి చూడాల్సిందే.
పాత గూటికి కొండా
Published Thu, Sep 5 2013 3:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement