రండి బాబు రండి..
నెల్లూరు(విద్య) : జిల్లా విద్యాశాధికారి కార్యాలయంలో ఎనిమిది నెలలుగా ఎఫ్‌ఏసీ డీఈఓ పాలనలో ఫైళ్లు ఓ మోస్తారుగా నడిచాయి. కొత్తగా డీఈఓ రానుండడంతో చివరి రెండు రోజుల్లో రేట్లు ఫిక్స్ చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో ఫైళ్లు చకచక కదులుతున్నాయి. అటెండర్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ల వరకు పనులను యుద్ధ ప్రాతిపదికన చక్కబెడుతున్నారు. రెన్యువల్స్‌కు ఒక రేటు.. రికగ్నైజేషన్‌కు ఒక రేటును నిర్ణయించినట్లు తెలిసింది.
రెన్యువల్స్ రేటులో అనుకున్న మొత్తం తగ్గితే రెన్యువల్ ఇచ్చే సంవత్సరాలు కూడా తగ్గిపోతున్నాయి. దీర్ఘకాలికంగా కదలని రెన్యువల్ ఫైల్స్ పచ్చనోట్ల గలగలతో పరుగులు తీస్తున్నాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధమైన వసూళ్లు జరుగుతుండడంతో డీఈఓ కార్యాలయం వద్ద సోమవారం చిన్నపాటి వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నాయి. 10 ఏళ్ల రెన్యువల్‌కు అనుకున్న మొత్తం వస్తేనే అమ్మగారు సంతకం పెడుతున్నారు. లేకపోతే తగ్గించేస్తున్నారని సిబ్బంది తెగేసి చెబుతున్నారు.
ఉన్న రెండు రోజుల్లోనే పెండింగ్‌లో ఉన్న ప్రైవేటు స్కూళ్ల ఫైళ్లన్నిటినీ క్లియర్ చేసి అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఏడు నెలలుగా తిరిగినా కనబడని స్పందన ఈ రోజు కనబడుతుండడంతో ప్రైవేటు స్కూళ్ల యాజమానులు సైతం డబ్బును లెక్కచేయకుండా అడిగిన కాడికి ఇచ్చుకుని పని పూర్తి చేసుకోవాలని పరుగులు తీస్తున్నారు.
స్టేషనరీ కొరత
డీఈఓ కార్యాలయంలో స్టేషనరీ కొరత విపరీతంగా ఉంది. మెడికల్ బిల్లులు కోసం వచ్చే ఉపాధ్యాయులకు ప్రింటర్లు పనిచేయడం లేదు. క్యాట్‌రిచ్‌లు లేవు. అనే సమాధానాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు పదేపదే డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
స్టేషనరీకి మూడు నెలలకు రూ.45 వేలు వస్తుందని, అది ఏమాత్రం సరిపోవడంలేదని పేర్లు చెప్పడానికి ఇష్టపడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రైవేటు పాఠశాలల ఫైళ్లను క్లియర్ చేయడంలో చొరవ చూపడంపై పెదవి విరుస్తున్నారు.
20న ఆర్‌జేడీ తనిఖీ...?
ఎఫ్‌ఏసీ డీఈఓ ఎన్.ఉషా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విద్యాశాఖలో జరిగిన అక్రమాలపై ఈ నెల 20న ఆర్‌జేడీ విచారణ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సెక్షన్లలో మార్పులు, సిబ్బందిపై అక్రమంగా వేటు వేయడం, ఇష్టమైన వాళ్లకి అనువైన సీట్లు ఇవ్వడం, స్థాయికి మించి అధికారాలను ఉపయోగించడం తదితర అంశాలపై సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ఆర్‌జేడీ తనిఖీ చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది.
రొటీన్ ఫైల్సే : ఉషా, ఇన్‌చార్జి డీఈఓ
రొటీన్ ఫైల్సే క్లియర్ చేస్తున్నాం. పెండింగ్ ఫైల్స్ ఎక్కడివి. ఆర్‌జేడీ విచారణ విషయం కచ్చితమైన సమాచారం నాకు తెలియదు.
సాంకేతిక నైపుణ్యంతో భవిష్యత్
కావలి: విద్యార్థులు సాంకేతిక కోర్సుల్లో నైపుణ్యం సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రీజినల్ ఇన్‌చార్జి కృష్ణన్ తెలిపారు. సోమవారం స్థానిక జేబీ డిగ్రీ కళాశాలలోని ఎస్‌ఆర్ శంకరన్ హాలులో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి నైపుణ్యంపై అవగాహన సదస్సును నిర్వహించారు. కృష్ణన్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధి ఉన్న కోర్సులను ఎంచుకోవాలన్నారు.
జేబీ డిగ్రీ కళాశాలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు కంప్యూటర్ కోర్సులు, ఎలక్ట్రికల్ వైరింగ్, రెఫ్రిజిరేటర్ మెకానిజమ్, హాస్పిటాలిటీ తదితర కోర్సులపై శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు చదువు పూర్తయిన వెంటనే ఉపాధి దొరకాలనే ఉద్దేశంతో ఈ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.ఆ సంస్థ ఉదయగిరి హబ్ ఇన్‌చార్జి పురుషోత్తం, కో-ఆర్డినేటర్ వేణుగోపాల్, జేబీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మేజర్ పాల్‌మనోహర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.