విత్తన విపత్తు
- ఆలస్యంగా వచ్చిన వరి విత్తనాలు
- అందులోనూ అరకొర రకాలే అమ్మకం
- మారిన విధానంతో రోజుల తరబడి ఇబ్బందులు
- స్వర్ణ,జయ, ప్రభాస్ రకాలు లేవు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
ఖరీఫ్ రైతు విత్తు విపత్తును ఎదుర్కొంటున్నాడు. వర్షాభావ పరిస్థితులతో దిగాలుగా ఉన్న అన్నదాత విత్తనాలు సమకూర్చుకోవడానికి అష్టకష్టాలకు గురవుతున్నాడు. విత్తనాల సరఫరా, పంపిణీ విధానంలో మార్పుతో ఇబ్బందులు అలవికానివిగా ఉన్నాయి. అధికారుల చీటీల కోసం క్యూలో ఒక రోజు,విత్తనాలు తీసుకెళ్లేందుకు మరో రోజు సమయం పడుతోంది. ఒక్కో రకం ఒక్కో చోట ఉండటంతో రెండు మూడు రకాల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే అరకొర రకాలే లభ్యం కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
నర్సీపట్నం/చోడవరం : ఖరీఫ్ రైతుకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఒక పక్క వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోగా మరో పక్క విత్తన సమస్య రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏటా జూన్ మొదటి వారానికే విత్తనాలు అందుబాటులో ఉండేవి. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యంతో విత్తన బ్యాగ్ ధర, సబ్సిడీ నిర్ధారణ కాక కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత విక్రయ కేంద్రాల కేటాయింపుల్లో మరింకొంత జాప్యం చోటుచేసుకుంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2.27లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగుకు అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు.
ఇందులో అధికంగా వరి లక్ష హెక్టార్లకు మించి చేపట్టాలని నిర్ణయించారు. గతేడాది మాదిరి కాకుండా ఒక్కో మండలంలో మూడు, నాలుగు చోట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా మొత్తంగా 19.5వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీకి లక్ష్యంగా చేసుకున్నారు. వీటిలో సగానికి మించి ఆథరైడ్జ్ డీలర్ల వద్ద నిల్వ చేశారు. గతేడాది వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలోనే విత్తనాలు అమ్మారు. ఇందుకు ఆశాఖకు ఏపీ సీడ్స్ రెండు శాతం కమీషన్ అందజేసేది.
అప్పట్లో ఈ అమ్మకాల్లో కొంతమంది వ్యవసాయాధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. దీనివల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది. దీంతో వ్యవసాయాధికారులంతా ఈ ఏడాది విత్తనాల అమ్మకాలకు దూరంగా ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏపీ సీడ్స్, జిల్లా వ్యవసాయశాఖ యంత్రాంగం కలిసి ఈ ఏడాది మండలాల్లోని ఆథరైడ్జ్ డీలర్లతో పాటు పీఏసీఎస్‌ల్లో విక్రయాలకు ప్రణాళికలు రూ పొందించారు. ఈమేరకు ఒక్కో మండలంలో మూడు నుంచి నాలుగు కేంద్రాల్లో అమ్ముతున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. గతేడాది మండల వ్యవసాయ కార్యాలయంలోనే రైతుల పాసు పుస్తకాల ఆధారంగా అవసరమైన విత్తనాలకు చీటీలు రాసేవారు. రైతులు సమీపంలో ఉన్న గోడౌన్‌లో చీటి ఇచ్చి తమకు నచ్చిన విత్తనాలను తీసుకు వెళ్లేవారు. రైతుల రద్దీ ఉన్నప్పటికీ ఉదయం వెళితే సాయంత్రానికి విత్తనాలు దొరికేవి.
ఈ ఏడాది అందుకు భిన్నంగా వ్యవసాయశాఖ కార్యాలయంలో అధికారులు చీటీలు రాసి ఇస్తే, వాటిని తీసుకుని ఆథరైడ్జ్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. చీటీల కోసం క్యూలో ఒక రోజు,విత్తనాలు తీసుకెళ్లేందుకు మరో రోజు సమయం పడుతోంది. ఒక్కో రకం ఒక్కో చోట ఉండటంతో రెండు మూడు రకాల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఇదే కాకుండా విత్తనాల కోసం క్యూలో గంటల తరబడి పస్తులతో ఉండాల్సిన పరిస్థితి.
కొన్ని రకాలే లభ్యం : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, వాతావరణం, భూముల సారా న్ని బట్టి కొన్ని రకాల వరి విత్తనాలనే కొన్నేళ్లు గా రైతులు వినియోగిస్తున్నారు. బిపీటీ రకాలై న సోనామసూరి, సాంబమసూరి కేవలం 20 శాతమే పండిస్తున్నారు. ఆర్‌జిఎల్ 20 శాతం, మిగతా 60శాతం భూముల్లో స్వర్ణ, 1001, 1010, సూపర్ జయ, 3626(ప్రభాస్)రకాలు చేపడుతున్నారు.
రిజర్వాయర్ల ప్రాంతాల్లో సాంబమసూరి, ఆర్‌జిఎల్ వేస్తుండగా వర్షాధా ర భూముల్లో స్వర్ణ, ప్రభాస్, 1001,1010, జయ రకాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తుపాన్లప్పుడు తట్టుకునే రకాలంటేనే ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం విక్రయకేంద్రాల వద్ద సోనామసూరి, సాంబమసూరి, ఆర్‌జిఎల్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థి తి రైతులకు మింగుడు పడడం లేదు.
సమయం వృథా...!
విత్తనాల తీసుకునేందుకు ఎక్కువ సమయం వృథా అవుతోంది. ఒక రోజు వ్యవసాయాధికారుల వద్ద చీటీలు రాయించడం, మరో రోజు విత్తనాలు తెచ్చుకోవాల్సి వస్తోంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.
అనిమిరెడ్డి అప్పలనాయుడు, కొండల అగ్రహారం,మాకవరపాలెం మండలం.
వారంరోజుల్లో అన్ని రకాలు
ప్రస్తుతం సోనామసూరి, ఆర్‌జిఎల్, సాంబ మసూరి రకాలను మాత్రమే ఏపీసీడ్స్ ఆథరైజ్డ్ దుకాణాలు, పీఏసీఎస్‌లలో విక్రయిస్తున్నారు. మరో వారం రోజుల్లో మిగతా రకాల విత్తనాలు కూడా సరఫరా అవుతాయి. నారుపోతకు దుక్కులు ఊపందుకునేలోగా మిగతా రకాలు కూడా వస్తాయి.
ఇ.శ్రీనివాస్, వ్యవసాయాధికారి, చోడవరం.