rice seeds
-
మూలాలకు పోదాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన భారతదేశంలో ఒకప్పుడు వేలాది రకాల వరి విత్తనాలు సాగులో ఉండేవి. నేల స్వభావం, నీటివసతి, భౌగోళిక స్వరూపం.. ఇలా పరిస్థితులను అనుసరించి ఆయా ప్రాంతాల్లో వివిధరకాల వరి సాగుచేసేవారు. అయితే దేశవాళీ వరి విత్తనాల దిగుబడి తక్కువగా ఉంటుండటం, భారీగా పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు తప్పనిసరిగా ఉత్పత్తి పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో విత్తనాల సంకరీకరణకు బీజం పడింది. అధిక దిగుబడి ఇచ్చేవి, పంటకాలం స్వల్పంగా ఉండేవి, వ్యాధులను, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అధిక దిగుబడి ఇచ్చే లాభదాయక వరి విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు వాటివైపు మొగ్గచూపడం ప్రారంభించారు. దీంతో క్రమంగా దేశవాళీ వరి సాగు తగ్గుతూ రావడం ప్రారంభమైంది. చివరకు సాగుచేసేవారులేక వేలాది రకాలు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అయితే అక్కడక్కడా మిగిలినవాటిలో ఉన్న ఔషధ విలువలు, పోషక విలువలు గుర్తించిన కొందరు కొన్ని రకాలను పునరుజ్జీవింపజేసేపనికి పూనుకున్నారు. ఇది సత్ఫలితాలనిచ్చి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని దేశీయ రకాలు తిరిగి సాగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా అత్తోటకు చెందిన 60 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని దేశవాళీ రకాలను విజయవంతంగా సాగుచేస్తూ లాభాలు పండిస్తున్నారు. ‘భూమి భారతి’ పేరుతో విత్తన నిధి మనం ఏనాడో మరిచిపోయిన దేశవాళీ వరి రకాలను సంరక్షించటం, అందులోని పోషకాలను నేటి తరానికి అందించాలనేది వీరి ఆశయం. ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులతో తీసిన విత్తనాలతో ‘భూమి భారతి’ పేరుతో ‘దేశవాళీ వరి విత్తన నిధి’ని 2022లో ఏర్పాటుచేశారు. ఇందుకు ‘తానా’ సహకరించింది. దేశీ వరి విత్తన నిధిని నిర్వహిస్తూ, రైతులు పండించిన దేశీ వరి బియ్యాన్ని, విలువ జోడించిన ఇతర ఆరోగ్యదాయక ఆహార ఉత్పత్తులను సంతల్లో, సోషల్‌మీడియాలో ప్రచారంతో విక్రయిస్తున్నారు. వీరు సాగుచేసిన వరి రకాల్లో బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే ‘రత్నచోళి’, అధిక పోషకాలు ఉండే సారంగనలి, దాసమతి, నెల్లూరు మొలకొలుకులు, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి తదితర ప్రముఖ దేశవాళీ రకాలున్నాయి. తులసి బాసోమొక్క 5 అడుగుల వరకు పెరుగుతుంది. పంటకాలం 40 రోజులు గింజ చాలా చిన్నగా ఉండి, అన్నం మంచి సువాసన కలిగి ఉండటం దీని ప్రత్యేక లక్షణం. ఒక్కసారి నాటితే మూడు పంటలు తీసుకోవచ్చు. పంటకాలం కేవలం 40 రోజులు పశ్చిమ బెంగాల్ దీని మూల స్థానం, మంచి పోషక విలువలు కలిగి తినడానికి అనువుగా ఉంటుంది. ఈ బియ్యాన్ని దేవుడికి నేవేద్యంగా పెడతారు. ఇంద్రాయణిసాధారణ ఎత్తులో పెరిగే ఈ వరి వంగడం పంటకాలం 130 రోజులు, బియ్యం మంచి సువాసన కలిగిఉంటాయి. అత్యధిక పోషక విలువలు కలిగిఉంటాయి. వండుకోవడానకి, తినడానికి ఈ బియ్యం అనుకూలంగా ఉంటాయి. ఈ బియ్యానికి సర్వరోగనివారిణిగా పేరుంది. మహారాష్ట్రలోని ఇంద్రాయణి నది పరీవాహక ప్రాంతంలో గతంలో ఎక్కువగా సాగులో ఉండటం వల్ల దీనికి ఇంద్రాయణి రైస్ అని పేరువచ్చింది. కాలాబట్టి5 నుంచి 6.5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. పంటకాలం 150 రోజులునలుపురంగులో ఉండే ఈ బియ్యాన్ని కాలాబట్, బర్మా బ్లాక్, మణిపూర్ బ్లాక్ అనే పేర్లతో పిలుస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రకాన్ని సాగుచేస్తుంటారు. ఈ నల్లబియ్యం ఉత్పత్తిలో ప్రస్తుతం మణిపూర్ అగ్రస్థానంలో ఉంది. ఇందులో ఆంథోసియానిన్ అనే యాంటి ఆక్సిడెంట్లు అధికం. మధుమేహ బాధితులు, హృద్రోగులకు ఇది గొప్ప ప్రయోజనకారి. క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రీ రాడికల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ప్రాచీన కాలంలో ఈ బియ్యంరాజకుటుంబాలు, ఉన్నతవర్గాలవారికి మాత్రమే అందుబాటులో ఉండేవి. మాపిళైసాంబమాపిళ్లై సాంబ మొక్క 4.5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. పంటకాలం 160 రోజులు ఈ బియ్యాన్ని ‘పెళ్లికొడుకు బియ్యం’ అని కూడా అంటారు. ఎరుపురంగులో ఉండే ఈ బియ్యాన్ని కొత్తగా పెళ్లయిన దంపతులకు ఇవ్వడం ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది. ఈ బియ్యం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కండపుష్టి, ధాతుపుష్టి, వీర్యవృద్ధి కలుగుతుంది.గర్భదారణ సమస్యలతో బాధపడే దంపతులకు ఉపకరిస్తుందనే నమ్మకం. తమిళనాడులోని తిరవణ్ణామలై ప్రాంతం ఈ విత్తనాలకు మూలకేంద్రం. నాగపట్టణం, తిరుచ్చురాపల్లి, తంజావూర్ జిల్లాల్లో రైతులు కొంతమేరకు సాగుచేస్తూ వస్తున్నారు. నవారమొక్క 5 అడుగుల వరకు పెరుగుతుంది. పంటకాలం 90 రోజులు ఈ విత్తనం త్రేతాయుగం నాటిది. బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. కేరళలోని పాలక్కాడ్ ప్రాంతం ఈ బియ్యానికి మూలకేంద్రంగా గుర్తించారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఈ బియ్యం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. నరాల బలహీనత, కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఈ బియ్యం చక్కగా దోహదపడతాయి. కేరళ సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఈ బియ్యాన్ని ఔషధంగా వినియోగిస్తారు. పక్షవాతం వచ్చినవారికి బాడీ మసాజ్‌లో వినియోగిస్తారు. బియ్యం నుంచి కూడా మొలకలు రావటం దీని ప్రత్యేకత. దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదుదేశవాళీ వరి వంగడాల్లో గణనీయమైన జన్యువైవిధ్యాలున్నాయి. వివిధ కారణాలతో అనేక రకాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటి సంరక్షణకు మా వంతు కృషిచేస్తున్నాం. దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదు. అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లోనూ కనీసం యాభై శాతం ఫలితాన్ని అందిస్తుంది. – యర్రు బాపన్న, సంప్రదాయ సాగు రైతుహైబ్రిడ్ బియ్యంతో ఆకలి అణగదుహైబ్రిడ్ బియ్యం తింటే ఆకలి అణగదు. దీనివల్ల మరో 50 శాతం అదనంగా అన్నం తినాల్సి వస్తుంది. రుచి కూడా అంత బాగుండదు. దేశవాళీ బియ్యం ఇందుకు భిన్నం. మంచి గ్‌లెసైమిక్ ఇండెక్స్ కలిగివుండటంతో కొన్ని రకాలు మధుమేహ రోగులకు ఆరోగ్య సంరక్షిణిగా నిలుస్తున్నాయి. –నామని రోశయ్య, సంప్రదాయ సాగు రైతుఈ రకాలు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రకృతి రైతులు సాగుచేస్తున్న అరుదైన దేశవాళీ వరి వంగడాల్లో కొన్ని మాత్రమే. తొమ్మిదేళ్ల క్రితం దీనికి అంకురార్పణ జరిగింది. ఇక్కడి రైతులు తొలుత 5 నుంచి 10 సెంట్లలో స్వల్పరకాలతో ఆరంభించి, ఏటా విస్తీర్ణాన్ని, సాగుచేసే రకాలను పెంచుకుంటూ వెళ్లారు. 2018లో చేపట్టిన వంద రకాల సాగు సత్ఫలితాన్నిచ్చింది. దీంతో 2019 ఖరీఫ్‌లో 180 రకాలను విత్తారు.్ఙభారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ శివప్రసాదరాజు నుంచి ఆయా రకాల విత్తనాలను సేకరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు కావాల్సిన ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలను స్వయంగా తయారుచేసుకుంటున్నారు. ప్రస్తుతం అత్తోట గ్రామంలో అరవై మంది రైతులు, సమష్టిగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. మొత్తం 85 ఎకరాల్లో దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు. ఇందుకు ఆద్యుడైన రైతు యర్రు బాపారావు. 365 రకాల దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు. వినియోగదారులు ఇప్పటికే అలవాటుపడిన మైసూర్మల్లిక, బహురూపి, నవార, నల్లబియ్యం వంటి రకాలను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తూ, ఇతర రకాలను విత్తన సంరక్షణ కోసం స్వల్పవిస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఈ గ్రామ రైతులు భారతదేశ వరి వంగడాల్లోని వైవిధ్యత సంరక్షణకు తోడ్పడుతూ, అక్కడి మట్టికి కొత్త పరిమళం అద్దారు. -
అద్భుతం.. అన్నదాతల ధాన్యాగారం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అద్భుత ఫలితాలు సాధిస్తూ అన్నదాతల ధాన్యాగారంగా ప్రగతి పథం వైపు దూసుకుపోతున్నది. ఇక్కడ శాస్త్రవేత్తలు సృష్టిస్తున్న వరి వంగడాలు నాణ్యమైన అధిక దిగుబడితో దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన పలు రకాల వరి వంగడాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సాగవుతున్నాయి. విదేశాలకు ఏటా లక్షల టన్నుల బీపీటీ రకాల సన్నబియ్యం ఎగుమతి అవుతూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. దీంతో ఈ పరిశోధన స్థానం ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగసింది. వరి పరిశోధన స్థానం నేపథ్యం.. 1961లో తెనాలిలో ప్రారంభమైన వరిపరిశోధన స్థానం 1973లో బాపట్లకు మార్చారు. అప్పటి నుంచి బాపట్ల వరి పరిశోధన స్థానంగా పనిచేస్తోంది. 2017లో వరి పరిశోధన స్థానం నుంచి వ్యవసాయ పరిశోధన స్థానంగా అప్‌గ్రేడ్ చేస్తూ.. 15 ఎకరాల నుంచి 40 ఎకరాలకు విస్తరించారు. కొత్త వంగడాల సృష్టి కేంద్రం.. 1982లో సోనామసూరి రకం ( బీపీటీ 3291), ధాన్యలక్ష్మి (బీపీటీ 1235), 1986లో సాంబమసూరి (బీపీటీ 5204) అనే సన్న రకం వంగడాన్ని కనుగొన్నారు. 1987లో బీపీటీ 4358, 2001లో బీపీటీ 1768 సన్నాలు, 2010లో బీపీటీ 2270 రకాల వంగడాలను సృష్టించారు. 2010లో బీపీటీ 2231, 2018లో బీపీటీ 2295 రకం ఉత్పత్తి చేయగా 2019లో బీపీటీ 2595 తేజ రకం ఉత్పత్తి చేశారు. 2020లో బీపీటీ 2782 భవతి, బీపీటీ 2411 సశ్య, 2023లో బీపీటీ 3050, బీపీటీ 2846, బీపీటీ 2841 నల్లబియ్యం, బీపీటీ 2848 హైప్రొటీన్ రకం వంగడాలను ఉత్పత్తి చేశారు. తెగుళ్లను తట్టుకునేలా నాణ్యతతో కూడిన విత్తనాలు ఉత్పత్తి చేయడం వల్లే అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇవి కాకుండా బీపీటీ 3082, 2858 రకాలు ఉత్పత్తి అయి మినీకిట్ దశలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకు.. వరి పరిశోధన స్థానం ఏర్పడి ఇప్పటికి 61 ఏళ్లు గడుస్తోంది. 2018 ఏడాది వరకు 57 ఏళ్ల కాలంలో కేవలం 7 వంగడాలను సృష్టించగా.. గడచిన 4 ఏళ్ల కాలంలోనే 9 రకాల కొత్త వరి వంగడాలు ఉత్పత్తి చేయడం గమనార్హం. వైఎస్ జగన్ప్రభుత్వం ప్రోత్సాహం, తోడ్పాటు వల్లే త్వరితగతిన నూతన వంగడాల సృష్టి సాధ్యమవుతున్నదని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త వంగడాలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన సీడ్‌ను ఉత్పత్తి చేసి అందిస్తున్నారు. ఏటా 60 ప్రైవేటు కంపెనీలకు సీడ్‌ను అందిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ఇక్కడ ఏడాదికి 600 క్వింటాళ్ల బ్రీడర్ సీడ్ తయారు చేస్తున్నారు. బీపీటీ విత్తనాల సాగు ఇలా బాపట్ల వరి పరిశోధన స్థానంలో సృష్టించిన బీపీటీ 5204 రకం విత్తనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా సుమారు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రైతుల కోసం నాణ్యమైన సీడ్ బాపట్ల వ్యవవసాయ పరిశోధన స్థానంలో నూతన వరి విత్తనాల ఉత్పత్తి జరుగుతున్నది. ఇక్కడ సృష్టించిన బీపీటీ 5204 రకం దేశవ్యాప్తంగా 75 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుండగా.. మరికొన్ని రకాల వంగడాలకు డిమాండ్ పెరిగింది. ఇవే కాకుండా బ్లాక్‌రైస్, హైప్రొటీన్రైస్ వంగడాలను సిద్ధం చేశాం. ఇవన్నీ తెగుళ్లు తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడినిచ్చి రైతులకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. –బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన స్థానం -
ఖరీఫ్ సీజన్‌కు వరి విత్తనాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన వివిధ రకాల వరి విత్తనాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. ఈ సీజన్‌కు ఎన్ని ఎకరాలకు, ఎన్ని వరి విత్తన రకాలను సిద్ధం చేశారన్న వివరాలను విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి శుక్రవారం నివేదించింది. వచ్చే ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారని సర్కారు అంచనా వేసిన నేపథ్యంలో ఆ మేరకు అన్ని రకాల విత్తనాలను ఆ సంస్థ అందుబాటులో ఉంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వీటిని సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. 67.78 లక్షల ఎకరాలకు సరిపోను..... రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ సీజన్లో 67.78 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆ ప్రకారం 19.72 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 13 రకాల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు. అందులో అత్యధికంగా ఎంటీయూ–1010 కాటన్ దొర సన్నాల వరి రకం విత్తనాలను 5 లక్షల క్వింటాలు సిద్ధం చేసి ఉంచారు. అవి 16 లక్షల ఎకరాలకు సరిపోతాయని నివేదికలో పేర్కొన్నారు. బీపీటీ–5204 సాంబ మసూరి రకం విత్తనాలను 4.80 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేశారు. అవి 15.90 లక్షల ఎకరాలకు సరిపోతాయి. 13 రకాల వరి విత్తనాల్లో ఈ రెండు రకాలే సగం ఉండటం విశేషం. ఈ రెండు రకాలపైనే రైతులు ఆసక్తి చూపుతారని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు అందుబాటులో ఉన్న వరి విత్తన రకాలు -
తెలంగాణ వరికి ‘నాసి’ రోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సోనా రకం వరి విత్తనాల్లో మొలకెత్తని వాటిని రాష్ట్ర వ్యవసాయశాఖ గుర్తించింది. సోనమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన (లాట్ నంబర్: 150480) విత్తనాలు నాసిరకమైనవని తేలింది. దీంతో వాటిని సీజ్ చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్ఎన్ఆర్–15048 అనే తెలంగాణ సోనా రకం వరి విత్తనాన్ని కనుగొన్నది. ఈ వరిలో గ్లైపోసేట్ శాతం తక్కువ ఉండటంతో ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరమన్న ప్రచారం ఉంది. దీంతో ఈ వరి బియ్యాన్ని అనేకమంది ఉపయోగిస్తున్నారు. ఈ వరిపై పలు రాష్ట్రాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో దీని సాగు పెరిగింది. దీంతో అనేక కంపెనీలకు విత్తనోత్పత్తి చేసే అవకాశం కల్పించారు. కానీ, కొన్ని కంపెనీలు నిర్లక్ష్యంగా ఉండటంతో నాసిరకపు విత్తనాలు వెలుగు చూస్తున్నాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. సోనమ్ కంపెనీ పంపిణీ చేసిన లాట్‌లోని కొన్ని విత్తనాలను పరీక్ష నిమిత్తం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యవసాయాధికారి లెబొరేటరీకి పంపారు. పరీక్షల్లో ఆ లాట్ విత్తనాలకు 55 శాతం మొలకెత్తే స్థాయి మాత్రమే ఉందని నిర్ధారించారు. ఒక అంచనా ప్రకారం ఈ లాట్ నంబర్ కలిగిన నాసిరకపు విత్తనాలను దాదాపు 50 నుంచి వంద క్వింటాళ్ల వరకు రైతులకు అమ్మేందుకు జిల్లాలకు సరఫరా చేసినట్లు సమాచారం. అయితే, ఎంతమేరకు ఇప్పటికే ఈ లాట్ నంబర్ కలిగిన తెలంగాణ సోనా విత్తనాలను రైతులు కొనుగోలు చేశారో మాత్రం తెలియదు. ఈ లాట్ నంబర్ కలిగిన విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయడానికి ముందే నాణ్యతను ఎందుకు కనుగొనలేదన్న ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాన్ని సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశముంది. తెలంగాణ సోనా విత్తనంలో జన్యుపరమైన లోపాలున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని వ్యవసాయశాఖ వర్గాలు ప్రకటించాయి. -
రబీ వరి నాట్లు 120%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి నాట్లు రికార్డు స్థాయిలో పడ్డాయి. తెలంగాణలో రబీ సీజన్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 18.52 లక్షల ఎకరాల్లో నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 17.10 లక్షల ఎకరాల్లో నాట్లుపడడం గమనార్హం. వరితో కలిపి రాష్ట్రంలో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 24.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు లక్ష్యానికి మించి 25.82 లక్షల (107%) ఎకరాల్లో సాగు కావడం విశేషం. అందులో శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.37 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటివరకు 2.52 లక్షల (106%) ఎకరాల్లో సాగైంది. ఇక వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.52 లక్షల (93%) ఎకరాల్లో సాగైంది. -
కొంప ముంచిన కల్తీ విత్తనాలు
► రబీ వరి చేపడితే ఊదగడ్డి పుట్టుకొచ్చింది ► ఎకరా భూమిలో పంట నష్టపోయిన రైతు మునగపాకః రబీ వరి విత్తనాల్లో కల్తీలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. మండలంలోని చూచుకొండకు చెందిన రైతు పెంటకోట రామసత్యనారాయణ పరిస్థితి ఇందుకు తార్కాణం. రూ. 35వేలు నష్టపోయాడు. రబీ వరిసాగుకు రైతు గతేడాది డిసెంబర్లో అధికారుల సూచనల మేరకు ఎకరా విస్తీర్ణంలో పంటను చేపట్టేందుకు 1010 రకం వరి విత్తనాలు 30కిలోల బస్తా రూ.780లకు కొనుగోలు చేశారు. సాధారణంగా వరిలో 5శాతం మేర ఊదగడ్డి పుట్టుకొస్తుంది. కానీ రబీ వరిలో 95శాతం ఊదగడ్డి పుట్టుకొచ్చింది. వెంటనే రైతు అధికారులను ఆశ్రయించాడు. శాస్త్రవేత్తల బృందం పంటను పరిశీలించింది. విత్తనం కల్తీ అయినట్టు గుర్తించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రైతుకు న్యాయం చేస్తామని స్థానిక వ్యవసాయాధికారులు రైతుకు హామీఇచ్చారు. కల్తీ విత్తనం కారణంగా రూ.35వేలు నష్టం వాటిల్లినట్టు రైతు వాపోతున్నాడు. ఇదే విషయాన్ని వ్యవసాయాధికారి పావని వద్ద ప్రస్తావించగా అక్కడక్కడ బ్యాగ్‌లలో కల్తీ విత్తనాలు వస్తున్నాయని, దీనిని ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు. -
ఆరుతడి పంటలు ఉత్తమం
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బావులు, చెరువు బోరు బావుల్లో కొద్ది కొద్దిగా నీరు చేరుతున్నది. ఈ నీటిని ఉపయోగించుకొని రైతులు వరి సాగు చేయడం కంటే కూడా ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం మంచిది.పుష్కలంగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో వరి మాత్రమే సాగు చేయాలనుకునే రైతులు.. ఊడ్పులు ఆలస్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని మెలకువలను తప్పనిసరిగా పాటించాలి.జూలై నెల ఆఖరి వరకు వరి సాగు ప్రారంభించే రైతాంగం మధ్యకాలిక రకాలను, ఇంకా ఆలస్యమైతే స్వల్పకాలిక రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి.ప్రస్తుత పరిస్థితుల్లో వరిని సాంప్రదాయ పద్ధతులకన్నా నేరుగా దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన వరి విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా గానీ, డ్రమ్ సీడర్‌తో విత్తుకొని సాగు చేయడం వల్ల పంట కాలాన్ని కోల్పోకుండా సకాలంలో వరి పంటను సాగు చేసుకోవచ్చు.రకాన్ని బట్టి డ్రమ్‌సీడర్‌తో అయితే 10 నుంచి 12 కిలోల విత్తనం, నేరుగా వెదజల్లడానికైతే 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం. కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండైజిమ్ పొడి మందును ఒక లీటరు నీటితో కలిపిన మందు ద్రావణంలో 24 గంటలు నానబెట్టిన తరువాత 12 నుంచి 24 గంటల మండె కట్టాలి. విత్తనాలు ముక్క పగిలి తెల్లగా కార వచ్చిన దశలో నేరుగా వెదజల్లుకోవాలి లేదా డ్రమ్‌సీడర్‌తో విత్తుకోవాలి. మొలక ఎక్కువ పొడవు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ పద్ధతుల ద్వారా విత్తుకున్నప్పుడు నేలను బాగా దమ్ము చేసి ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకున్న మరుసటి రోజు బురద మీదనే విత్తుకోవడం గాని, వెదజల్లుకోవడంగాని చేసుకోవాలి. కలుపు సమస్య అధిగమించడం కోసం విత్తిన 5 రోజులకు ప్రెటిలాక్లోర్+సెవ్నర్ కలసివున్న మందును 500 మి.లీ. లేదా బ్యూటాక్లోర్+సెవ్నర్ 1250 మి.లీ. లేదా ఆక్సాడైయార్జిల్ 35 గ్రాముల పొడి మందును అర లీటరు నీటిలో కరిగించి 25 కిలోల పొడి ఇసుకతో కలిపి ఎకరానికి చల్లుకోవాలి. డ్రమ్‌సీడర్ పద్ధతిలో విత్తుకున్నప్పుడు నాట్ల పద్ధతికన్నా 7 నుంచి 10 రోజులు ముందుగా పంట కోతకు రావడమే కాకుండా 10 నుంచి 15 శాతం అధిక దిగుబడి సాధించవచ్చు.రైతుకు నారు పెంపకం, నాటడం వంటి పనుల కోసం కూలీల కొరతను అధిగమించడమేకాకుండా ఖర్చు ఆదా వల్ల ఈ పద్ధతి ద్వారా అధిక నికరాదాయం వస్తుంది. డ్రమ్‌సీడర్‌తో విత్తిన మొక్కలు వరుస క్రమంలో ఉండడం వల్ల సూర్యరశ్మి, గాలి బాగా సోకి, చీడపీడల బెడద తగ్గుతుంది. సస్యరక్షణ ఖర్చు కూడా తగ్గుతుంది. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
విత్తన విపత్తు
ఆలస్యంగా వచ్చిన వరి విత్తనాలు అందులోనూ అరకొర రకాలే అమ్మకం మారిన విధానంతో రోజుల తరబడి ఇబ్బందులు స్వర్ణ,జయ, ప్రభాస్ రకాలు లేవు ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ఖరీఫ్ రైతు విత్తు విపత్తును ఎదుర్కొంటున్నాడు. వర్షాభావ పరిస్థితులతో దిగాలుగా ఉన్న అన్నదాత విత్తనాలు సమకూర్చుకోవడానికి అష్టకష్టాలకు గురవుతున్నాడు. విత్తనాల సరఫరా, పంపిణీ విధానంలో మార్పుతో ఇబ్బందులు అలవికానివిగా ఉన్నాయి. అధికారుల చీటీల కోసం క్యూలో ఒక రోజు,విత్తనాలు తీసుకెళ్లేందుకు మరో రోజు సమయం పడుతోంది. ఒక్కో రకం ఒక్కో చోట ఉండటంతో రెండు మూడు రకాల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే అరకొర రకాలే లభ్యం కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . నర్సీపట్నం/చోడవరం : ఖరీఫ్ రైతుకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఒక పక్క వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోగా మరో పక్క విత్తన సమస్య రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏటా జూన్ మొదటి వారానికే విత్తనాలు అందుబాటులో ఉండేవి. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యంతో విత్తన బ్యాగ్ ధర, సబ్సిడీ నిర్ధారణ కాక కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత విక్రయ కేంద్రాల కేటాయింపుల్లో మరింకొంత జాప్యం చోటుచేసుకుంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2.27లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగుకు అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో అధికంగా వరి లక్ష హెక్టార్లకు మించి చేపట్టాలని నిర్ణయించారు. గతేడాది మాదిరి కాకుండా ఒక్కో మండలంలో మూడు, నాలుగు చోట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా మొత్తంగా 19.5వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీకి లక్ష్యంగా చేసుకున్నారు. వీటిలో సగానికి మించి ఆథరైడ్జ్ డీలర్ల వద్ద నిల్వ చేశారు. గతేడాది వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలోనే విత్తనాలు అమ్మారు. ఇందుకు ఆశాఖకు ఏపీ సీడ్స్ రెండు శాతం కమీషన్ అందజేసేది. అప్పట్లో ఈ అమ్మకాల్లో కొంతమంది వ్యవసాయాధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. దీనివల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది. దీంతో వ్యవసాయాధికారులంతా ఈ ఏడాది విత్తనాల అమ్మకాలకు దూరంగా ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏపీ సీడ్స్, జిల్లా వ్యవసాయశాఖ యంత్రాంగం కలిసి ఈ ఏడాది మండలాల్లోని ఆథరైడ్జ్ డీలర్లతో పాటు పీఏసీఎస్‌ల్లో విక్రయాలకు ప్రణాళికలు రూ పొందించారు. ఈమేరకు ఒక్కో మండలంలో మూడు నుంచి నాలుగు కేంద్రాల్లో అమ్ముతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గతేడాది మండల వ్యవసాయ కార్యాలయంలోనే రైతుల పాసు పుస్తకాల ఆధారంగా అవసరమైన విత్తనాలకు చీటీలు రాసేవారు. రైతులు సమీపంలో ఉన్న గోడౌన్లో చీటి ఇచ్చి తమకు నచ్చిన విత్తనాలను తీసుకు వెళ్లేవారు. రైతుల రద్దీ ఉన్నప్పటికీ ఉదయం వెళితే సాయంత్రానికి విత్తనాలు దొరికేవి. ఈ ఏడాది అందుకు భిన్నంగా వ్యవసాయశాఖ కార్యాలయంలో అధికారులు చీటీలు రాసి ఇస్తే, వాటిని తీసుకుని ఆథరైడ్జ్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. చీటీల కోసం క్యూలో ఒక రోజు,విత్తనాలు తీసుకెళ్లేందుకు మరో రోజు సమయం పడుతోంది. ఒక్కో రకం ఒక్కో చోట ఉండటంతో రెండు మూడు రకాల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఇదే కాకుండా విత్తనాల కోసం క్యూలో గంటల తరబడి పస్తులతో ఉండాల్సిన పరిస్థితి. కొన్ని రకాలే లభ్యం : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, వాతావరణం, భూముల సారా న్ని బట్టి కొన్ని రకాల వరి విత్తనాలనే కొన్నేళ్లు గా రైతులు వినియోగిస్తున్నారు. బిపీటీ రకాలై న సోనామసూరి, సాంబమసూరి కేవలం 20 శాతమే పండిస్తున్నారు. ఆర్‌జిఎల్ 20 శాతం, మిగతా 60శాతం భూముల్లో స్వర్ణ, 1001, 1010, సూపర్ జయ, 3626(ప్రభాస్)రకాలు చేపడుతున్నారు. రిజర్వాయర్ల ప్రాంతాల్లో సాంబమసూరి, ఆర్‌జిఎల్ వేస్తుండగా వర్షాధా ర భూముల్లో స్వర్ణ, ప్రభాస్, 1001,1010, జయ రకాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తుపాన్లప్పుడు తట్టుకునే రకాలంటేనే ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం విక్రయకేంద్రాల వద్ద సోనామసూరి, సాంబమసూరి, ఆర్‌జిఎల్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థి తి రైతులకు మింగుడు పడడం లేదు. సమయం వృథా...! విత్తనాల తీసుకునేందుకు ఎక్కువ సమయం వృథా అవుతోంది. ఒక రోజు వ్యవసాయాధికారుల వద్ద చీటీలు రాయించడం, మరో రోజు విత్తనాలు తెచ్చుకోవాల్సి వస్తోంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అనిమిరెడ్డి అప్పలనాయుడు, కొండల అగ్రహారం,మాకవరపాలెం మండలం. వారంరోజుల్లో అన్ని రకాలు ప్రస్తుతం సోనామసూరి, ఆర్‌జిఎల్, సాంబ మసూరి రకాలను మాత్రమే ఏపీసీడ్స్ ఆథరైజ్డ్ దుకాణాలు, పీఏసీఎస్‌లలో విక్రయిస్తున్నారు. మరో వారం రోజుల్లో మిగతా రకాల విత్తనాలు కూడా సరఫరా అవుతాయి. నారుపోతకు దుక్కులు ఊపందుకునేలోగా మిగతా రకాలు కూడా వస్తాయి. ఇ.శ్రీనివాస్, వ్యవసాయాధికారి, చోడవరం.