కొంప ముంచిన కల్తీ విత్తనాలు
► రబీ వరి చేపడితే ఊదగడ్డి పుట్టుకొచ్చింది
► ఎకరా భూమిలో పంట నష్టపోయిన రైతు
మునగపాకః రబీ వరి విత్తనాల్లో కల్తీలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. మండలంలోని చూచుకొండకు చెందిన రైతు పెంటకోట రామసత్యనారాయణ పరిస్థితి ఇందుకు తార్కాణం. రూ. 35వేలు నష్టపోయాడు. రబీ వరిసాగుకు రైతు గతేడాది డిసెంబర్‌లో అధికారుల సూచనల మేరకు ఎకరా విస్తీర్ణంలో పంటను చేపట్టేందుకు 1010 రకం వరి విత్తనాలు 30కిలోల బస్తా రూ.780లకు కొనుగోలు చేశారు. సాధారణంగా వరిలో 5శాతం మేర ఊదగడ్డి పుట్టుకొస్తుంది. కానీ రబీ వరిలో 95శాతం ఊదగడ్డి పుట్టుకొచ్చింది. వెంటనే రైతు అధికారులను ఆశ్రయించాడు. శాస్త్రవేత్తల బృందం పంటను పరిశీలించింది.
విత్తనం కల్తీ అయినట్టు గుర్తించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రైతుకు న్యాయం చేస్తామని స్థానిక వ్యవసాయాధికారులు రైతుకు హామీఇచ్చారు. కల్తీ విత్తనం కారణంగా రూ.35వేలు నష్టం వాటిల్లినట్టు రైతు వాపోతున్నాడు. ఇదే విషయాన్ని వ్యవసాయాధికారి పావని వద్ద ప్రస్తావించగా అక్కడక్కడ బ్యాగ్‌లలో కల్తీ విత్తనాలు వస్తున్నాయని, దీనిని ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు.