సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సోనా రకం వరి విత్తనాల్లో మొలకెత్తని వాటిని రాష్ట్ర వ్యవసాయశాఖ గుర్తించింది. సోనమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన (లాట్ నంబర్: 150480) విత్తనాలు నాసిరకమైనవని తేలింది. దీంతో వాటిని సీజ్ చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్‌ఎన్‌ఆర్–15048 అనే తెలంగాణ సోనా రకం వరి విత్తనాన్ని కనుగొన్నది. ఈ వరిలో గ్‌లైపోసేట్ శాతం తక్కువ ఉండటంతో ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరమన్న ప్రచారం ఉంది.
దీంతో ఈ వరి బియ్యాన్ని అనేకమంది ఉపయోగిస్తున్నారు. ఈ వరిపై పలు రాష్ట్రాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో దీని సాగు పెరిగింది. దీంతో అనేక కంపెనీలకు విత్తనోత్పత్తి చేసే అవకాశం కల్పించారు. కానీ, కొన్ని కంపెనీలు నిర్లక్ష్యంగా ఉండటంతో నాసిరకపు విత్తనాలు వెలుగు చూస్తున్నాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. సోనమ్ కంపెనీ పంపిణీ చేసిన లాట్‌లోని కొన్ని విత్తనాలను పరీక్ష నిమిత్తం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యవసాయాధికారి లెబొరేటరీకి పంపారు. పరీక్షల్లో ఆ లాట్ విత్తనాలకు 55 శాతం మొలకెత్తే స్థాయి మాత్రమే ఉందని నిర్ధారించారు.
ఒక అంచనా ప్రకారం ఈ లాట్ నంబర్ కలిగిన నాసిరకపు విత్తనాలను దాదాపు 50 నుంచి వంద క్వింటాళ్ల వరకు రైతులకు అమ్మేందుకు జిల్లాలకు సరఫరా చేసినట్లు సమాచారం. అయితే, ఎంతమేరకు ఇప్పటికే ఈ లాట్ నంబర్ కలిగిన తెలంగాణ సోనా విత్తనాలను రైతులు కొనుగోలు చేశారో మాత్రం తెలియదు. ఈ లాట్ నంబర్ కలిగిన విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయడానికి ముందే నాణ్యతను ఎందుకు కనుగొనలేదన్న ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాన్ని సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశముంది. తెలంగాణ సోనా విత్తనంలో జన్యుపరమైన లోపాలున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని వ్యవసాయశాఖ వర్గాలు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment