మూలాలకు పోదాం | Cultivation in natural farming methods | Sakshi
Sakshi News home page

మూలాలకు పోదాం

Published Thu, Oct 24 2024 5:57 AM | Last Updated on Thu, Oct 24 2024 5:57 AM

Cultivation in natural farming methods

దేశవాళీ వరి సాగుకు జై కొడుతున్న అత్తోట రైతులు 

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు 

ఈ బియ్యం వాడటం వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితాలు 

వినియోగదారుల నుంచి మంచి డిమాండ్‌ 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన భారతదేశంలో ఒకప్పుడు వేలాది రకాల వరి విత్తనాలు సాగులో ఉండేవి. నేల స్వభావం, నీటివసతి, భౌగోళిక స్వరూపం.. ఇలా పరిస్థితులను అనుసరించి ఆయా ప్రాంతాల్లో వివిధరకాల వరి సాగుచేసేవారు. అయితే దేశవాళీ వరి విత్తనాల దిగుబడి తక్కువగా ఉంటుండటం, భారీగా పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు తప్పనిసరిగా ఉత్పత్తి పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో విత్తనాల సంకరీకరణకు బీజం పడింది. 

అధిక దిగుబడి ఇచ్చేవి, పంటకాలం స్వల్పంగా ఉండేవి, వ్యాధులను, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అధిక దిగుబడి ఇచ్చే లాభదాయక వరి విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు వాటివైపు మొగ్గచూపడం ప్రారంభించారు. దీంతో క్రమంగా దేశవాళీ వరి సాగు తగ్గుతూ రావడం ప్రారంభమైంది. చివరకు సాగుచేసేవారులేక వేలాది రకాలు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. 

అయితే అక్కడక్కడా మిగిలినవాటిలో ఉన్న ఔషధ విలువలు, పోషక విలువలు గుర్తించిన కొందరు కొన్ని రకాలను పునరుజ్జీవింపజేసేపనికి పూనుకున్నారు. ఇది సత్ఫలితాలనిచ్చి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని దేశీయ రకాలు తిరిగి సాగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా అత్తోటకు చెందిన 60 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని దేశవాళీ రకాలను విజయవంతంగా సాగుచేస్తూ లాభాలు పండిస్తున్నారు.  

‘భూమి భారతి’ పేరుతో విత్తన నిధి 
మనం ఏనాడో మరిచిపోయిన దేశవాళీ వరి రకాలను సంరక్షించటం, అందులోని పోషకాలను నేటి తరానికి అందించాలనేది వీరి ఆశయం. ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులతో తీసిన విత్తనాలతో ‘భూమి భారతి’ పేరుతో ‘దేశవాళీ వరి విత్తన నిధి’ని 2022లో ఏర్పాటుచేశారు. ఇందుకు ‘తానా’ సహకరించింది. 

దేశీ వరి విత్తన నిధిని నిర్వహిస్తూ, రైతులు పండించిన దేశీ వరి బియ్యాన్ని, విలువ జోడించిన ఇతర ఆరోగ్యదాయక ఆహార ఉత్పత్తులను సంతల్లో, సోషల్‌మీడియాలో ప్రచారంతో విక్రయిస్తున్నారు. వీరు సాగుచేసిన వరి రకాల్లో బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే ‘రత్నచోళి’, అధిక పోషకాలు ఉండే సారంగనలి, దాసమతి, నెల్లూరు మొలకొలుకులు, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి తదితర ప్రముఖ దేశవాళీ రకాలున్నాయి. 

తులసి బాసో
మొక్క 5 అడుగుల వరకు పెరుగుతుంది. పంటకాలం 40 రోజులు 
గింజ చాలా చిన్నగా ఉండి, అన్నం మంచి సువాసన కలిగి ఉండటం దీని ప్రత్యేక లక్షణం. ఒక్కసారి నాటితే మూడు పంటలు తీసుకోవచ్చు. పంటకాలం కేవలం 40 రోజులు పశ్చిమ బెంగాల్‌ దీని మూల స్థానం, మంచి పోషక విలువలు కలిగి తినడానికి అనువుగా ఉంటుంది. ఈ బియ్యాన్ని దేవుడికి నేవేద్యంగా పెడతారు.   

ఇంద్రాయణి
సాధారణ ఎత్తులో పెరిగే ఈ వరి వంగడం పంటకాలం 130 రోజులు, బియ్యం మంచి సువాసన కలిగిఉంటాయి. అత్యధిక పోషక విలువలు కలిగిఉంటాయి. వండుకోవ­డా­నకి, తినడానికి ఈ బియ్యం అనుకూలంగా ఉంటాయి. ఈ బియ్యానికి సర్వరోగనివారిణిగా పేరుంది. మహారాష్ట్రలోని ఇంద్రాయణి నది పరీవాహక ప్రాంతంలో గతంలో ఎక్కువగా సాగులో ఉండటం వల్ల దీనికి ఇంద్రాయణి రైస్‌ అని పేరువచ్చింది.  

కాలాబట్టి
5 నుంచి 6.5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. పంటకాలం 150 రోజులు
నలుపురంగులో ఉండే ఈ బియ్యాన్ని కాలాబట్, బర్మా బ్లాక్, మణిపూర్‌ బ్లాక్‌ అనే పేర్లతో పిలుస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రకాన్ని సాగుచేస్తుంటారు. ఈ నల్లబియ్యం ఉత్పత్తిలో ప్రస్తుతం మణిపూర్‌ అగ్రస్థానంలో ఉంది. ఇందులో ఆంథోసియానిన్‌ అనే యాంటి ఆక్సిడెంట్లు అధికం. మధుమేహ బాధితులు, హృద్రోగులకు ఇది గొప్ప ప్రయోజనకారి. క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రీ రాడికల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ప్రాచీన కాలంలో ఈ బియ్యంరాజకుటుంబాలు, ఉన్నతవర్గాలవారికి మాత్రమే అందుబాటులో ఉండేవి. 

మాపిళైసాంబ
మాపిళ్లై సాంబ మొక్క 4.5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. పంటకాలం 160 రోజులు 
ఈ బియ్యాన్ని ‘పెళ్లికొడుకు బియ్యం’ అని కూడా అంటారు. ఎరుపురంగులో ఉండే ఈ బియ్యాన్ని కొత్తగా పెళ్లయిన దంపతులకు ఇవ్వడం ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది. ఈ బియ్యం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కండపుష్టి, ధాతుపుష్టి, వీర్యవృద్ధి కలుగుతుంది.గర్భదారణ సమస్యలతో బాధపడే దంపతులకు ఉపకరిస్తుందనే నమ్మకం. తమిళనాడులోని తిరవణ్ణామలై ప్రాంతం ఈ విత్తనాలకు మూలకేంద్రం. నాగపట్టణం, తిరుచ్చురాపల్లి, తంజావూర్‌ జిల్లాల్లో రైతులు కొంతమేరకు సాగుచేస్తూ వస్తున్నారు. 

నవార
మొక్క 5 అడుగుల వరకు పెరుగుతుంది. పంటకాలం 90 రోజులు 
ఈ విత్తనం త్రేతాయుగం నాటిది. బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. కేరళలోని పాలక్కాడ్‌ ప్రాంతం ఈ బియ్యానికి మూలకేంద్రంగా గుర్తించారు. తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కారణంగా ఈ బియ్యం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.  నరాల బలహీనత, కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఈ బియ్యం చక్కగా దోహదపడతాయి. కేరళ సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఈ బియ్యాన్ని ఔషధంగా వినియోగిస్తారు. పక్షవాతం వచ్చినవారికి బాడీ మసాజ్‌లో వినియోగిస్తారు. బియ్యం నుంచి కూడా మొలకలు రావటం దీని ప్రత్యేకత. 

దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదు
దేశవాళీ వరి వంగడాల్లో గణనీయమైన జన్యువైవిధ్యాలున్నాయి. వివిధ కారణాలతో అనేక రకాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటి సంరక్షణకు మా వంతు కృషిచేస్తున్నాం. దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదు. అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లోనూ కనీసం యాభై శాతం ఫలితాన్ని అందిస్తుంది.   – యర్రు బాపన్న, సంప్రదాయ సాగు రైతు

హైబ్రిడ్‌ బియ్యంతో ఆకలి అణగదు
హైబ్రిడ్‌ బియ్యం తింటే ఆకలి అణగదు. దీనివల్ల మరో 50 శాతం అదనంగా అన్నం తినాల్సి వస్తుంది. రుచి కూడా అంత బాగుండదు. దేశవాళీ బియ్యం ఇందుకు భిన్నం. మంచి గ్‌లెసైమిక్‌ ఇండెక్స్‌ కలిగివుండటంతో కొన్ని రకాలు మధుమేహ రోగులకు ఆరోగ్య సంరక్షిణిగా నిలుస్తున్నాయి.   –నామని రోశయ్య, సంప్రదాయ సాగు రైతు

ఈ రకాలు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రకృతి రైతులు సాగుచేస్తున్న అరుదైన దేశవాళీ వరి వంగడాల్లో కొన్ని మాత్రమే. తొమ్మిదేళ్ల క్రితం దీనికి అంకురార్పణ జరిగింది. ఇక్కడి రైతులు తొలుత  5 నుంచి 10 సెంట్లలో స్వల్పరకాలతో ఆరంభించి, ఏటా విస్తీర్ణాన్ని, సాగుచేసే రకాలను పెంచుకుంటూ వెళ్లారు. 

2018లో చేపట్టిన వంద రకాల సాగు సత్ఫలితాన్నిచ్చింది. దీంతో 2019 ఖరీఫ్‌లో 180 రకాలను విత్తారు.్ఙభారత్‌ బీజ్‌ స్వరాజ్‌ మంచ్‌’ శివప్రసాదరాజు నుంచి ఆయా రకాల విత్తనాలను సేకరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు కావాల్సిన ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలను స్వయంగా తయారుచేసుకుంటున్నారు.   

ప్రస్తుతం అత్తోట గ్రామంలో అరవై మంది రైతులు, సమష్టిగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. మొత్తం 85 ఎకరాల్లో దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు. ఇందుకు ఆద్యుడైన రైతు యర్రు బాపారావు. 365 రకాల దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు. వినియోగదారులు ఇప్పటికే అలవాటుపడిన మైసూర్‌మల్లిక, బహురూపి, నవార, నల్లబియ్యం వంటి రకాలను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తూ, ఇతర రకాలను విత్తన సంరక్షణ కోసం స్వల్పవిస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఈ గ్రామ రైతులు భారతదేశ వరి వంగడాల్లోని వైవిధ్యత సంరక్షణకు తోడ్పడుతూ, అక్కడి మట్టికి కొత్త పరిమళం అద్దారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement