సంస్థాగత ఎన్నికలపై బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి
నిబంధనలకు విరుద్ధంగా జిల్లా అధ్యక్షులను నియమించారనే విమర్శలు
రాష్ట్ర అధ్యక్ష పదవికి జిల్లా అధ్యక్షుల అభిప్రాయం కీలకం
అందువల్ల నిబంధనలకు విరుద్ధమైనా తమ వారినే ముఖ్య నేతలు ఎంపిక చేశారనే ఆరోపణలు
సాక్షి, అమరావతి: బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగిన తీరుపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఇది పేరుకే ఎన్నిక గానీ... వాస్తవానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్టీ సంఘటనా కార్యదర్శి కనుసన్నల్లో తమకు నచ్చిన వారికే జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టారని ఆ నేతల్లో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఎన్నికలకు ముందు రోజు రాత్రి జిల్లా ఎన్నికల అధికారులకు ముఖ్య నేతలు ఫోన్ చేసి తాము చెప్పిన వారినే అధ్యక్షులుగా ప్రకటించాలని ఒత్తిడి చేశారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా పక్కా పథకం ప్రకారం తమకు నచ్చినవారినే జిల్లా అధ్యక్షులుగా నియమించుకున్నారని సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై ప్రభావం ఉంటుందనే.. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికల తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుల అభిప్రాయం కీలకం. అందువల్ల మెజారిటీ జిల్లాల అధ్యక్షులుగా తమ మనుషులు ఉండాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే ఈ ఎన్నికలను పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడిపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఇలా...
» బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో కొన్ని నిబంధనలు పాటించాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖలను ఆదేశించింది.
» కనీసం ఆరేళ్లు పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉండటంతోపాటు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల వారే జిల్లా అధ్యక్షులుగా పోటీకి అర్హులని జాతీయ నాయకత్వం స్పష్టంగా నిబంధనల్లో పేర్కొన్నట్లు నాయకులు చెబుతున్నారు.
» కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రామకృష్ణ వయసు కేవలం 40 సంవత్సరాలేనని, అతనిపై తీవ్ర నేరారోపణలతో కూడిన కేసులు కూడా ఉన్నట్లు ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.
» నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అభిరుచి మధుకు నిబంధనల ప్రకారం కనీసం ఆరు సంవత్సరాల క్రియాశీలక సభ్యత్వం లేదని, ఆయనపై గతంలో రౌడీషీటర్‌గా అభియోగాలు ఉన్నాయని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది.
» అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అతనికి అర్హత లేదని ఎన్నికల అధికారి సావిత్రి తిరస్కరించారని, అయినా ఆయన్నే తిరిగి జిల్లా అధ్యక్షులుగా నియమించినట్లు బీజేపీలో తీవ్ర చర్చ నడుస్తోంది.
» అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సాయిలోకేష్ కేవలం మూడు సంవత్సరాల కిందటే బీజేపీలో చేరినట్లు అదే పార్టీ నాయకులు చెబుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష పదవిని 60 ఏళ్లు దాటిన వ్యక్తికి కట్టబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
» అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసేవారు నామినేషన్ వేయడానికి మద్దతుగా మండల అధ్యక్షులు బలపరచాలనే నిబంధన ఉంది. కానీ, ఆ నిబంధనను ఎక్కడా పాటించలేదని తెలుస్తోంది. ఇలా అన్ని జిల్లాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఒకే వర్గం వారిని అధ్యక్షులుగా నియమించారనే చర్చ జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment