సీట్లివ్వకుంటే ఎలా?
* స్టాలిన్‌కు మొర
* 18 మంది నేతల్లో అసంతృప్తి
సాక్షి, చెన్నై : అధిష్టానం నిర్ణయం డీఎంకే సీనియర్లలో అసంతృప్తిని రగుల్చుతోంది. జిల్లా కార్యదర్శుల పదవుల ఎన్నికల్లో కోట్లు కుమ్మరించాల్సి వచ్చిందని, అలాంటప్పుడు తమకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వకుంటే ఎలా? అని పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌ను ప్రశ్నించే పనిలో పలువురు నేతలు పడ్డారు. డీఎంకేలో సంస్థాగత ఎన్నికల పర్వం సాగుతున్న విషయం తెలిసిందే. 65 జిల్లా కార్యదర్శుల పదవుల భర్తీ జోరందుకుంటోంది. రోజుకు కొన్ని జిల్లాలు చొప్పున ఎంపిక చేసి అధినేత కరుణానిధి పర్యవేక్షణలో ఎన్నికలు సాగుతున్నాయి.
31 జిల్లాలకు మాత్రం కొత్త ముఖాలను తెరపైకి తెచ్చే విధంగా ఎన్నికలు సాగుతున్నాయి. మిగిలిన 34 జిల్లాల్లో పార్టీలో ఆయా జిల్లాల్లో పలుకుబడి కల్గిన నేతలు, సీనియర్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలు ఏక గ్రీవం అయ్యాయి. అయితే, జిల్లా కార్యదర్శుల ఎన్నికల బరిలో నిలబడి గెలిచిన వాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కరుణానిధి తేల్చారు. ఇందుకు తగ్గ హామీ పత్రాన్ని ఆయా కార్యదర్శుల నుంచి తీసుకుని ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ చర్యలు ఆయా నేతల్లో అసంతృప్తిని రగుల్చుతున్నాయి.
జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో గెలుపొందేందుకు నాయకులు రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలు ఆయా జిల్లాల్లో కాకుండా చెన్నైలో ఏర్పాటు చేసి ఉండడంతో తమ మద్దతుదారులు, తమకు అనుకూలంగా ఓట్లు వేసే నాయకుల్ని ఇక్కడకు తీసుకురావడంతో పాటుగా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాల్ని కల్పిస్తున్నట్టు సమాచారం. గెలుపు లక్ష్యంగా కొన్ని చోట్ల తాయిలాలు సైతం పంపిణీ చేసినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు గాని, తమ కుటుంబలోని వ్యక్తులకు గానీ సీట్లు ఇవ్వమని అధిష్టానం స్పష్టం చేయడాన్ని అనేక మంది నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
స్టాలిన్‌కు వినతి: అధిష్టానం హామీ పత్రానికి ప్రధానంగా స్టాలిన్ మద్దతు సీనియర్లు ఇరకాటంలో పడ్డారు. 18 మంది నాయకులు జిల్లాల కార్యదర్శుల పదవుల్ని చేజిక్కించుకున్నారు. అయితే, పార్టీకి ఏళ్ల తరబడి సేవల్ని అందిస్తున్న తమకు ఇతర పదవులు దక్కవన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. దీంతో హామీ పత్రం వ్యవహారంలో ఎన్నికల అనంతరం మార్పులు చేర్పులకు చర్యలు తీసుకోవాలని స్టాలిన్ వద్ద మొర పెట్టుకునే పనిలో పడ్డారు. వేర్వేరుగా ఆ నేతలు స్టాలిన్‌ను కలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటుగా తమకు పదవులు దక్కే విధంగా అధినేత కరుణానిధిపై ఒత్తిడి తెచ్చి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు.
అదే సమయంలో డీఎంకే నుంచి బయటకు వెళ్లిన నెపోలియన్ బీజేపీల చేరడం, మరి కొందరు తన బాటలో నడవనున్నట్టు ఆయన ప్రకటించడాన్ని డీఎంకే అధిష్టానం నిశితంగా పరిశీలిస్తున్నది. ఎక్కడ వలసలు బయలు దేరుతాయోనన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని హామీ పత్రం విషయంలో స్వల్ప మార్పులకు కరుణానిధి యోచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తన వద్దకు వచ్చే సీనియర్లకు సంస్థాగత ఎన్నికల అనంతరం తదుపరి చర్యలు తీసుకుందామన్న భరోసా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.