త్వరలో పోస్టల్ ఏటీఎంలు
- 2015 నాటికి అన్ని ఆఫీసులకు ఆన్‌లైన్
- తపాలా సూపరింటెండెంటు రామారావు
మాకవరపాలెం : తపాలాశాఖ ఏటీఎం సౌకర్యం కల్పిస్తోంది. ఆశాఖ అనకాపల్లి డివిజన్ సూపరింటెండెంట్ డి.సి.హెచ్.రామారావు ఈ విషయం తెలిపారు. మండల కేంద్రంలోని పోస్టాఫీసును శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిక్డాలతోపాటు కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2015 నాటికి అన్ని గ్రామీణ పోస్టాఫీసులను ఆన్‌లైన్‌కు ప్రతిపాదించామన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో త్వరలో ఏటీఎం ఏర్పాటు చేస్తామన్నారు.
తన పరిధిలోని 47 పోస్టాఫీసుల్లో కొత్త వాతావరణం కోసం చర్యలు చేపట్టామన్నారు. ఉపాధి కూలీలు, పెన్షన్‌దారులకు చెల్లింపులకు అనకాపల్లి డివిజన్ పరిధిలో 392 మంది సీఎస్పీలు అవసరమన్నారు. ప్రస్తుతం 288 మంది ఉన్నారని తెలిపారు. త్వరలో మరో 35 మంది నియామకానికి వచ్చే నెల 2న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నారు. లబ్ధిదారుల నుంచి కాకుండా స్థానిక పెద్దల నుంచి ఫిర్యాదులొస్తున్నందున సీఎస్పీలపై విచారణకు అవకాశం లేదన్నారు.
తక్కువ ఖర్చుతో సేవలు
ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు లక్ష్యంగా తమ శాఖ పని చేస్తున్నదన్నారు. ఇప్పటికే లాజిస్టిక్ పేరుతో పార్శిల్ సర్వీసును ప్రారంభించామన్నారు. మై స్టాంప్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. రూ. 300 చెల్లిస్తే వారి ఫొటోతో స్టాంప్‌ను అందజేస్తామన్నారు.
ఆ స్టాంపులను అతికించుకుని ఎక్కడికైనా వారు గ్రీటింగ్స్, ఇతర ఆహ్వాన పత్రికలు పంపిచుకోవచ్చన్నారు. తక్కువ కమిషన్‌తో ఇన్‌స్టెంట్ మనీయార్డర్(ఐఎంవో), మొబైల్ మనీ ట్రాన్స్‌ఫర్ స్కీము (ఎంఎంటిఎస్) సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు. మీ సేవ ద్వారా ప్రస్తుతం విద్యుత్ బిల్లులు కట్టించుకుంటున్నామని, త్వరలో ఫోన్ బిల్లులు, పాస్ పోర్టులకు దరఖాస్తులను స్వీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.