టీచర్స్ కాలనీ సమీపంలోని బెంగళూరు తారురోడ్డు
హిందూపురం అర్బన్: ఎద్దు ఈనింది అంటే గాటికి కట్టెయ్ అన్న చందంగా నిధులు వచ్చాయంటే చాలు అవసరం ఉన్నా లేకున్నా వ్యక్తిగత ప్రయోజనం కోసం ఖర్చుచేసే విధంగా తయారైంది హిందూపురం పాలకవర్గం నైజం. అధికారులు కూడా అన్నింటికీ ఊ.. కొడుతుండటంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. హిందూపురం– బెంగళూరు తారురోడ్డు హౌసింగ్‌బోర్డు ఏరియాల్లో బ్రహ్మండంగా ఉంది. బాగున్న రోడ్డు కంట్రాక్టర్ జేసీబీలతో తొలగించి ఆ స్థలంలో కొత్త సీసీ రోడ్డు వేస్తున్నారు. బెంగళూరు రహదారిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ వాల్మీకి సర్కిల్ 2017–18 కోర్‌నెట్ నిధులు కింద రూ.7.2కోట్లు నిధులు మంజూరు చేసింది. సుమారు 2.5 కిలోమీటర్ల మేరకు కొత్త సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.
చిన్నమార్కెట్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు తారు రోడ్డు బాగుంది. అయితే ఈ మార్గంలో రోడ్డు పనులకు నిధులు మంజూరు కావడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ వార్డు నుంచి రహదారి పనులు చేపడుతున్నారు. వాస్తవంగా పరిగి బస్టాండు నుంచి చిన్నమార్కెట్ వాల్మీకి సర్కిల్ వరకు రోడ్డు బాగా ఇరుకుగా ఉంది. ఈరహదారిలో ఎదురెదురుగా వాహనాలు వస్తే ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి ఉంది. రోడ్డు వెడల్పు చేసి నిర్మిస్తే అనుకులంగా ఉండేది. అలా కాకుండా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడి అవసరం లేని చోట్ల పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి రోడ్డు నిర్మించాల్సి వస్తోందని ఓ అధికారి చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు సూగురు నుంచి పాదయాత్ర చేపట్టిన సమయంలో పట్టణంలోరోడ్లు వెడల్పు చేయాలని స్థానికులు కోరారు. దీనికి సంబంధించి ఇప్పుడు నిధులు మంజూరు కావడంతో బాగున్న రోడ్డుపైనే రోడ్డు వేయడానికి వెచ్చిస్తునట్లు సమాచారం.
అసంపూర్తిగా బైపాస్‌రోడ్డు
హిందూపురం పట్టణంలోని పట్టుగూళ్ల మార్కెట్ వద్ద నుంచి రహమత్‌పురం సర్కిల్ గుండా బెంగళూరును కలుపుతూ ఏర్పాటు చేసిన బైపాస్‌రోడ్డు నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయింది. పట్టణంగా గుండా భారీవాహనాలు శివారు నుంచి ప్రయాణించే వీలుగా అప్పటి ప్రభుత్వం రూ.5,38కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో నిర్మించిన బైపాస్‌రోడ్డును ఐదేళ్లు అవుతున్నా పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. రహమత్‌పురం సర్కిల్ నుంచి పాల డెయిరీ వరకు ఇంకా ఒకవైపు రోడ్డు నిర్మాణం ఇంతవరకు చేపట్టక పోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈరోడ్డు నిర్మాణం కంట్రాక్టు జిల్లా మంత్రికి చెందిన కంపెనీ కావడంతో అర్‌అండ్‌బీ అధికారులు ఇన్నేళ్లయినా ఒత్తిడి చేయలేకపోతున్నారు. దీంతో రహమత్‌పురం నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు వరకు ఒక వైపు రోడ్డులోనే రాకపోకలు సాగుతున్నాయి. పెద్ద వాహనాలు వెళ్తున్న సమయంలో ఇతర వాహనాలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. బైపాస్‌రోడ్డు పూర్తిస్థాయి నిర్మాణం కాకపోవడంతో వాహనాలు ఇటూ ప్రయాణం చేయకుండా పరిగిరోడ్డు, సద్భావన సర్కిల్ దారిగుండానే వెళ్తున్నాయి.
భూమిపూజ చేసి ఏడాదైనా
అసంపూర్తిగా ఉన్న బైపాస్‌రోడ్డు నిర్మాణానికి రూ.4.20కోట్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే బాలకృష్ణ గత ఏడాది భూమిపూజ చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పనులు జరగలేదు. కేవలం ఆటోనగర్ ప్రాంతంలో రోడ్డు మధ్యన పొడవుగా డిౖవైడర్లు ఏర్పాటు చేశారే గానీ పనులు మాత్రం పూర్తి చేయలేదు. అంతేగాక పట్టణంలోని చాల ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న రోడ్డు గురించి పాలకులు అర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడంలేదు. పెరుగున్న జనాభాతో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్ రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అలాగే కేఎల్‌రోడ్డు, ఎంఎఫ్‌రోడ్డు పునరుద్ధరణపై ఎలాంటి దృíష్టి సారించడంలేదు.
ప్యాచులు పడుతున్నాయని సీసీ రోడ్డు వేస్తున్నాం
తరుచూ ప్యాచులు పడుతున్నాయి. మరమ్మతులకు ఎక్కువ ఖర్చు అవుతోంది. దీంతో పూర్తిగా సీసీరోడ్డు వేయాలని ప్రతిపాదించి రోడ్డు పనులు చేస్తున్నాం. అలాగే బైపాస్‌రోడ్డు పనులు ఈనెలలో ప్రారంభిస్తాం. రహమత్‌పురం వద్ద కొన్ని అక్రమణలు ఉన్నాయి. వాటిని తొలగిస్తున్నాం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. త్వరలోనే పూర్తిచేయిస్తాం. – సునిత, ఏఈ, ఆర్‌అండ్‌బీ
Comments
Please login to add a commentAdd a comment