కమిషనర్‌పై బదిలీవేటు? | Commissioner suspended the transfer? | Sakshi
Sakshi News home page

కమిషనర్‌పై బదిలీవేటు?

Published Sun, Apr 10 2016 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

Commissioner suspended the transfer?

పనితీరుపై మంత్రి, సీఎం  అసహనం
మేయర్‌తో విభేదాలు కలెక్టర్‌తో సన్నిహిత సంబంధాలపై విమర్శలు
{పత్యామ్నాయంగా సీనియర్ ఐఏఎస్‌ల పేర్ల పరిశీలన


విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ బదిలీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కమిషనర్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నగరంలో పారిశుధ్యం ఏమాత్రం బాగోలేదంటూ ఇటీవలే క్లాస్ తీశారు. మేయర్ కోనేరు శ్రీధర్‌కు, కమిషనర్‌కు మధ్య విభేదాలు ముదిరాయి. ఈ క్రమంలో బదిలీ షురూ అవుతుందన్న వాదనలు బలపడుతున్నాయి. మొత్తం మీద కమిషనర్ బదిలీ ప్రచారంపై కార్పొరేషన్ ఉద్యోగులతో  పాటు నగర ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ వర్గమైతే ఏకంగా కమిషనర్ బదిలీని ధ్రువీకరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. గతేడాది జనవరిలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వీరపాండియన్ తనదైన శైలిలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు మకాం మార్చిన దగ్గర నుంచి సమీక్షలు, సమావేశాలతో బిజీగా ఉంటున్న కమిషనర్ నగర ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి.

 
పుష్కర చిచ్చు...

కృష్ణా పుష్కరాలకు సంబంధించి నగరపాలక సంస్థ సుమారు రూ.700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్ బడ్జెట్‌లో రూ.360 కోట్లకు కుదించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లు విదిల్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేటాయించిన పుష్కర నిధులు చాలవని, మరికొంత పెంచాలని కమిషనర్ కోరగా, చంద్రబాబు సీరియస్ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. కమిషనర్ పనితీరుపై మున్సిపల్ మంత్రి పి.నారాయణ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు భోగట్టా. కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కన్నబాబుతో సైతం కమిషనర్ మంచి సంబంధాలు కొనసాగించకపోవడంపై మంత్రికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. కలెక్టర్ బాబు.ఏకు అత్యంత దగ్గరగా ఉంటూ సీడీఎంఏను సైతం పట్టించుకోకపోవడంపై మంత్రి గుస్సాగా ఉన్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో వీరపాండియన్‌ను సాగనంపాలనే పట్టుదలతో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది

 

కోల్డ్ వార్.. కౌన్సిల్‌లో బహిర్గతం..
మేయర్, కమిషనర్ మధ్య కొద్దినెలలుగా సాగుతున్న కోల్డ్ వార్ ఇటీవల జరిగిన కౌన్సిల్ సాక్షిగా బహిర్గతమైంది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి పది శాతం ఫైన్ విధింపులో మినహాయింపు ఇవ్వాలన్న టీడీపీ కార్పొరేటర్ల డిమాండ్‌కు కమిషనర్ ససేమిరా అన్నారు. 168 జీవో ప్రకారం రెండో అంతస్తుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే వరకు ఇదే విధానం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మేయర్ కొంత అసహనానికి గురయ్యారు. పుష్కరాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో 23 రోడ్లను విస్తరించాలని నిర్ణయించినప్పటికీ ఇంతవరకు అవి ఓ కొలిక్కి రాలేదు. టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య, ఎస్టేట్స్ విభాగాల పనితీరు ఏమాత్రం బాగోలేదని పలుమార్లు మేయర్ చెప్పినప్పటికీ కమిషనర్ ఉదాశీనంగా వ్యవహరించారనే వాదనలు ఉన్నాయి.


ఈ క్రమంలో కమిషనర్ పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో మేయర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి, మేయర్, సీఎం కమిషనర్ వ్యవహారశైలిపై అసహనంతో ఉన్న నేపథ్యంలో బదిలీ వేటు తప్పదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కృష్ణా పుష్కరాలకు సంబంధించి గడువు ముంచుకొస్తోంది. కమిషనర్ వీరపాండియన్ బదిలీ అనివార్యమైన పక్షంలో సీనియర్ ఐఏఎస్‌ను కమిషనర్‌గా నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యామ్నాయంగా రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement