కట్టలు తెగిన ఆగ్రహం
► గుత్తిలో తల్లీ, ఇద్దరు బిడ్డల
► ఆత్మ‘హత్య’లపై బంధువుల ఆందోళన
► భార్యా పిల్లలను భర్త, అతని కుటుంబ సభ్యులే చంపి ఆత్మహత్యగా
► చిత్రీకరించినట్లు ఆరోపణ
► నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్
► ప్రభుత్వాస్పత్రి మార్చురీ ఎదుట
► బైఠాయింపు, ధర్నా, ఆస్పత్రి గేట్లు మూసివేత
గుత్తి: గుత్తి ప్రభుత్వాస్పత్రి పరిసరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి. తల్లీ, ఇద్దరు పిల్లల ఆత్మ‘హత్య’ల నేపథ్యంలో మృతురాలి పుట్టింటి వారు, బంధువులు ఆందోళనకు దిగారు. గుత్తికి చెందిన నేత్రావతి, ఆమె ఇద్దరు పిల్లలు మురారి, ముఖేశ్‌ను కుటుంబ యజమాని రఘుబాబు, అతని కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ వారు స్థానిక ప్రభుత్వాస్పత్రి ప్రధాన గేట్లను మూసివేసి ధర్నాకు దిగారు. అంతకు ముందు మార్చురీ ఎదుట భైటాయించి నిరసన తెలిపారు. నేత్రావతి చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాద న్నారు. పైగా పిల్లలంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ అన్నారు. వివాహేతర సంబంధం కోసం రఘుబాబే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిప్పులు చెరిగారు. రఘుబాబు సహా అతని ఉంపుడుగత్తెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల మద్దతు: నేత్రావతి, ఆమె ఇద్దరు పిల్లల మరణానికి కారణమైన రఘుబాబును తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ బెంగళూరు నుంచి వచ్చిన ఆమె తల్లి అన్నపూర్ణమ్మ, పెద్దమ్మ వెంకటలక్ష్మమ్మ, సోదరులు అశోక్, చంద్రశేఖర్, అక్క భారతి, చెల్లెళ్లు అశ్వని, ఆశా, శాలిని, శేకమ్మ, మేనమామలు కిరణ్, నారాయణస్వామి సహా మరో 50 మంది బంధువులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. ఎమ్మార్పీఎస్, ఐద్వా నాయకులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామాంజనే యులు తమ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. ధర్నా విరమించాలని కోరగా వారు ససేమిరా అన్నారు. డీవైఎస్పీ, తహశీల్దార్ సమక్షంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పెళ్లి సమయంలో తీసుకున్న రూ.4 లక్షల కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రఘుబాబు ఉంచుకున్న మహిళపైనా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. తహశీల్దార్ హరిప్రసాద్, ఆస్పత్రి సూపరిండెంట్ మాధవకృష్ణ, ఎస్‌ఐ రామాంజనేయులు, ఎమ్మార్సీఎస్ మండల శాఖ అధ్యక్షులు అంజిన్ ప్రసాద్, ఐద్వా నాయకురాళ్లు రేణుక, సునీత, మదార్‌బీ, సీపీఎం మండల శాఖ అధ్యక్షులు శ్రీరాములు, న్యాయవాది రాజశేఖర్, కేవీపీఎస్ అధ్యక్షులు మల్లికార్జున సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించడానికి అంగీకరించడంతో ధర్నా విరమించారు.
మృతదేహాలకు పోస్టుమార్టం: నేత్రావతి, ఆమె పిల్లలు మురారి, ముఖేశ్ మృతదేహాలకు బుధవారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చెట్నేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. రఘుబాబు కుటుంబ సభ్యుల అరెస్టు: నేత్రావ తి, ఇద్దరు పిల్లల మృతి కేసులో భర్త రఘుబాబు, అత్త శాంతకుమారి, బావ ప్రసాద్, అక్క చాముండి, ఆడబిడ్డ ఉమను ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.