విశాఖ రైల్వేజోన్ కోసం కమిటీ ఏర్పాటు
► రాజధానిని కవర్ చేస్తూ 106.30 కిలోమీటర్ల కొత్త లైన్లకు ప్రతిపాదనలు
► దానికి మొత్తం రూ. 2679.59 కోట్ల వ్యయ అంచనా
► పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేం
► వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం
న్యూఢిల్లీ
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకు సీనియర్ రైల్వే అధికారులతో ఒక కమిటీని నియమించినట్లు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఆయనీ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులేంటని, అసలు అలాంటి ప్రతిపాదన ఏమైనా ఉందా అని విజయసాయిరెడ్డి రైల్వే మంత్రిని ప్రశ్నించారు. దాంతో.. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13 (మౌలిక సదుపాయాలు)లో 8వ ఐటెం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు గల అవకాశాలను రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలించాల్సి ఉందన్నారు. ఇందుకోసం సీనియర్ రైల్వే అధికారులతో ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ కమిటీ ఇందులో భాగంగా ఉన్న పలువురు స్టేక్‌హోల్డర్లు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో వివరించారు.
అలాగే.. నంబూరు జంక్షన్ నుంచి అమరావతి మీదుగా విజయవాడ-కాజీపేట మార్గాన్ని ఎర్రుపాలెం వద్ద కలిపేలా దక్షిణ మధ్య రైల్వే ఏమైనా ప్రతిపాదన సిద్ధం చేసిందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అమరావతి నుంచి పెదకూరపాడు, సత్తెనపల్లి మీదుగా గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్లేందుకు కొత్త రైల్వే లైను కోసం సర్వే ఏమైనా మొదలైందా అని అడిగారు. ఒకవేళ మొదలైతే నంబూరు- ఎర్రుపాలెం మధ్య ఏవేం స్టేషన్లు వస్తాయి, అమరావతి నుంచి నరసరావుపేటకు ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పమన్నారు. ఈ రెండు కొత్త లైన్లకు అంచనా వ్యయం ఎంతని ప్రశ్నించారు. కొత్త రైల్వేలైన్ల పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ముగుస్తాయని కూడా ఆయన అడిగారు.
వాటికి రైల్వే మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నంబూరు జంక్షన్ నుంచి అమరావతి మీదుగా విజయవాడ-కాజీపేట మార్గాన్ని ఎర్రుపాలెం వద్ద కలిపేలా కొత్త లైనుకు ప్రతిపాదన వచ్చిందన్నారు. నంబూరు- అమరావతి-ఎర్రుపాలెం విద్యుదీకరణతో కలిపి డబుల్ లైన్ (56.8 కిమీ), పెదకూరపాడు-అమరావతి విద్యుదీకరణ లేకుండా సింగిల్ లైన్ (24.5 కిమీ), సత్తెనపల్లి-నరసరావు పేట విద్యుదీకరణ లేకుండా సింగిల్ లైన్ (25 కిమీ)లకు సంబంధించి మొత్తం 106.30 కిలోమీటర్ల మార్గానికి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇప్పటికే ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ మార్గంలో ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు, రేవెల, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, కొత్తపల్లి, వెడ్డమాను, తాడికొండ, నిడుముక్కొల, చాగంటివారిపాలెం స్టేషన్లు ఉంటాయని వివరించారు. ఈ రెండు లైన్లకు కలిపి మొత్తం రూ. 2679.59 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ఈ పనులు చేపట్టడం, పూర్తి చేయడంలో పలు అంశాలున్నాయని.. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు భూమి అప్పగించడం లాంటివి రైల్వే మంత్రిత్వశాఖ చేతుల్లో ఉండవని తెలిపారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఫలానా తేదీ అని ఏమీ నిర్ణయించలేదన్నారు.