
అతితక్కువ సమయం కేటాయిస్తారా..
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన సమయం ఇవ్వలేదని పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. తమకు అతితక్కువ సమయం కేటాయించడం పట్ల చైర్మన్ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
రాష్ట్రానికి సంబంధించి కీలక అంశంపై తమకు అతితక్కువ సమయం కేటాయించడంపై మండిపడ్డారు. అంతకుముందు ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమనే అంశంతో పాటు పూర్వాపరాలను వివరించే క్రమంలోనే కేటాయించిన సమయం అయిపోయిందని, ప్రసంగం ముగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజయసాయి రెడ్డిపై ఒత్తిడి చేశారు. కీలక అంశంపై తనకు మరింత సమయం ఇవ్వాలని, కనీసం 15 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి కోరారు. టీడీపీకి 27 నిమిషాలు సమయం ఇచ్చారని తనకు మరింత సమయం ఇవ్వాలని కోరినా వెంకయ్యనాయుడు నిరాకరించారు.