vizag railway zone
-
AP: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం
సాక్షి, ఢిల్లీ: విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని, జోన్ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారాయన. రాజ్యసభలో సోమవారం కేంద్రీయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రశ్నించారు. దీనికి రైల్వే మంత్రి బదులిస్తూ.. రైల్వో జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు. అంతకు ముందు బిల్లుపై శ్రీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రైల్వేకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై రైల్వే మంత్రికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద మూడు సంవత్సరాలుగా డీపీఆర్ పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. 68 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రతి రోజు 21వేల ట్రైన్లు నడుస్తున్నాయి. దేశంలో 7350 రైల్వే స్టేషన్ల నుండి ప్రతిరోజు 2.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. రోజుకు 30 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని తెలిపారు. ఇంతటి గొప్ప వ్యవస్థకు సారధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన అభినందించారు. ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావాలి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి, రైల్వే మంత్రిని కోరారు. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదు. దీంతో ఉద్యోగార్ధులు రైల్వే పరీక్షల కోసం పక్క రాష్ట్రంలో సికింద్రాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు తగినన్ని వ్యాగన్లు కేటాయించాలి వైజాగ్ స్టీల్ ప్లాంటుకు డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాగన్లు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు సరఫరాలో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. తద్వారా ఉత్పత్తి కుంటుపడుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. వ్యాగన్ల కొరత కారణంగా మహానది కోల్ ఫీల్డ్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు తగినంతగా బొగ్గు సరఫరా చేయలేక పోతున్నారు. ఫలితంగా స్టీల్ ప్లాంటులో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేయాల్సి వచ్చింది. దీనివలన ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. సాలీనా 28 వేల కోట్ల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలనుకోవడం సరికాదని ఆయన అన్నారు. లాభాల బాటలోనున్న సంస్థలు ప్రైవేటు పరం చేయకూడదన్నది బీజేపీ ప్రభుత్వం విధానం అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయాలనుకోవడం శోచనీయని అన్నారు. రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాల ఖాళీలు రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. 2020-21లో 9529 ఖాళీలు భర్తీ చేయగా 2021-22లో 10637 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. ఈ లెక్కన మొత్తం ఖాళీలు భర్తీ చేయడానికి 30 ఏళ్ళు పడుతుంది. 2019లో రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తు రుసుం రూపంలో రైల్వే శాఖకు 864 కోట్ల ఆదాయం చేకూరింది. 2019లో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ నేటి వరకు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారని రైల్వే మంత్రిని ప్రశ్నించారు. యూపీఎస్సీ మాదిరిగా రైల్వేలో కూడా ఉద్యోగాల భర్తీ నిర్ణీత కాలంలో ప్రతి సంవత్సరం జరగాలని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. మహిళల భాగస్వామ్యం పెరగాలి రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని విజయసాయి రెడ్డి సూచించారు. లాజిస్టిక్ రంగంలో 20% మంది మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారు. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారిలో మహిళలు కేవలం 1 శాతం మాత్రమే. రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు. సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీలు భర్తీ చేయాలి సెంట్రల్ యూనివర్శిటీల్లో ఏర్పడ్డ ఖాళీలు యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు. దేశంలో కేంద్ర విద్యా శాఖ పరిధిలో ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 4వ తేదీలోపు ఈ ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర విద్యా శాఖ కోరింది. నిర్దేశించిన సమయంలో ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. -
నిరాశతోనే చంద్రబాబు విమర్శలు: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోవడం వల్లే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని ఎంపీ దత్తాత్రేయ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా చోరీకి గురైందో చెప్పకుండా మోదీపై చంద్రబాబు విమర్శలు చేయడం శోచనీయమని దుయ్యబట్టారు. ఏపీకి రైల్వే జోన్ ఇచ్చినా దానిపై కూడా బాబు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా ఇలాంటివి మానుకుని ఏపీలోని ప్రధాన అంశాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం ఆయన అహంభావానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ 6 స్థానాలు గెలిస్తే అదే గొప్ప అని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో ఖాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి లేఖ రాసినట్టు దత్తాత్రేయ తెలిపారు. -
జేసీ మనిషా? పశువా? : బొత్స
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీల భాష జుగుప్సాకరంగా ఉందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జేసీ దివాకర్ రెడ్డి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని తీవ్ర స్థాయిలో గర్హించారు. ఇలాంటి నాయకుల వల్లే మిగిలిన వారికి చెడ్డపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. వైజాగ్ రైల్వే జోన్ కావాలని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్ష చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. విభజన హామీల్లో ఉన్న రైల్వే జోన్ గురించి నాలుగేళ్లుగా ఏం చేశారని నిలదీశారు. ఏం ముఖం పెట్టుకుని దీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంపీ అనే రెండు పదాలు పేరుకు ముందు ఉన్నాయనే అహంకారంతో టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. అందుకే వారు వినియోగిస్తున్న భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని చెప్పారు. పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన తాను ఇలాంటి భాషను వినియోగించడం ఎక్కడా చూడలేదన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి సంతలో పశువుల్ని కొన్నట్లు తీసుకున్న ఎంపీలతో కలిపి టీడీపీ వద్ద ఉన్న 18 మంది ఎంపీలు ఏం సాధించారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి వైజాగ్ రైల్వే జోన్‌ను వైఎస్సార్ సీపీ సాధిస్తుందని చెప్పారు. -
విశాఖ రైల్వేజోన్ కోసం కమిటీ ఏర్పాటు
► రాజధానిని కవర్ చేస్తూ 106.30 కిలోమీటర్ల కొత్త లైన్లకు ప్రతిపాదనలు ► దానికి మొత్తం రూ. 2679.59 కోట్ల వ్యయ అంచనా ► పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేం ► వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం న్యూఢిల్లీ విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకు సీనియర్ రైల్వే అధికారులతో ఒక కమిటీని నియమించినట్లు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఆయనీ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులేంటని, అసలు అలాంటి ప్రతిపాదన ఏమైనా ఉందా అని విజయసాయిరెడ్డి రైల్వే మంత్రిని ప్రశ్నించారు. దాంతో.. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13 (మౌలిక సదుపాయాలు)లో 8వ ఐటెం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు గల అవకాశాలను రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలించాల్సి ఉందన్నారు. ఇందుకోసం సీనియర్ రైల్వే అధికారులతో ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ కమిటీ ఇందులో భాగంగా ఉన్న పలువురు స్టేక్హోల్డర్లు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో వివరించారు. అలాగే.. నంబూరు జంక్షన్ నుంచి అమరావతి మీదుగా విజయవాడ-కాజీపేట మార్గాన్ని ఎర్రుపాలెం వద్ద కలిపేలా దక్షిణ మధ్య రైల్వే ఏమైనా ప్రతిపాదన సిద్ధం చేసిందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అమరావతి నుంచి పెదకూరపాడు, సత్తెనపల్లి మీదుగా గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్లేందుకు కొత్త రైల్వే లైను కోసం సర్వే ఏమైనా మొదలైందా అని అడిగారు. ఒకవేళ మొదలైతే నంబూరు- ఎర్రుపాలెం మధ్య ఏవేం స్టేషన్లు వస్తాయి, అమరావతి నుంచి నరసరావుపేటకు ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పమన్నారు. ఈ రెండు కొత్త లైన్లకు అంచనా వ్యయం ఎంతని ప్రశ్నించారు. కొత్త రైల్వేలైన్ల పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ముగుస్తాయని కూడా ఆయన అడిగారు. వాటికి రైల్వే మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నంబూరు జంక్షన్ నుంచి అమరావతి మీదుగా విజయవాడ-కాజీపేట మార్గాన్ని ఎర్రుపాలెం వద్ద కలిపేలా కొత్త లైనుకు ప్రతిపాదన వచ్చిందన్నారు. నంబూరు- అమరావతి-ఎర్రుపాలెం విద్యుదీకరణతో కలిపి డబుల్ లైన్ (56.8 కిమీ), పెదకూరపాడు-అమరావతి విద్యుదీకరణ లేకుండా సింగిల్ లైన్ (24.5 కిమీ), సత్తెనపల్లి-నరసరావు పేట విద్యుదీకరణ లేకుండా సింగిల్ లైన్ (25 కిమీ)లకు సంబంధించి మొత్తం 106.30 కిలోమీటర్ల మార్గానికి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇప్పటికే ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు, రేవెల, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, కొత్తపల్లి, వెడ్డమాను, తాడికొండ, నిడుముక్కొల, చాగంటివారిపాలెం స్టేషన్లు ఉంటాయని వివరించారు. ఈ రెండు లైన్లకు కలిపి మొత్తం రూ. 2679.59 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ఈ పనులు చేపట్టడం, పూర్తి చేయడంలో పలు అంశాలున్నాయని.. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు భూమి అప్పగించడం లాంటివి రైల్వే మంత్రిత్వశాఖ చేతుల్లో ఉండవని తెలిపారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఫలానా తేదీ అని ఏమీ నిర్ణయించలేదన్నారు. -
విశాఖ రైల్వేజోన్ కోసం హోరెత్తిన నిరసనలు
విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖకు రైల్వేజోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి వద్ద రైల్వే ట్రాక్ పై నేతలు బెఠాయించారు. ఆందోళ కార్యక్రమాల్లో పాల్గొన్న అఖిలపక్షనేతలను పోలీసులు అక్కడి నుంచి లాక్కెళ్లారు. వైఎస్ఆర్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, అదీప్ రాజులతో పాటూ పలువురు వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.