AP: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం | Vizag Railway Zone On Track Railway Minister Replies Vijayasai Reddy | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం: కేంద్ర రైల్వే మంత్రి

Published Mon, Aug 8 2022 8:30 PM | Last Updated on Mon, Aug 8 2022 8:47 PM

Vizag Railway Zone On Track Railway Minister Replies Vijayasai Reddy - Sakshi

సాక్షి, ఢిల్లీ: విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని, జోన్‌ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారాయన. రాజ్యసభలో సోమవారం కేంద్రీయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రశ్నించారు. దీనికి రైల్వే మంత్రి బదులిస్తూ.. రైల్వో జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు.

అంతకు ముందు బిల్లుపై శ్రీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రైల్వేకు సంబంధించి రాష్ట్రంలో  పెండింగ్‌లో  ఉన్న సమస్యలపై రైల్వే మంత్రికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద  మూడు సంవత్సరాలుగా  డీపీఆర్‌ పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. 68 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రతి రోజు 21వేల ట్రైన్లు నడుస్తున్నాయి. దేశంలో 7350 రైల్వే స్టేషన్ల నుండి ప్రతిరోజు 2.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని  విజయసాయి రెడ్డి తెలిపారు. రోజుకు 30 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని తెలిపారు. ఇంతటి గొప్ప వ్యవస్థకు సారధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన అభినందించారు.

ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావాలి
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి, రైల్వే మంత్రిని కోరారు. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదు. దీంతో ఉద్యోగార్ధులు రైల్వే పరీక్షల కోసం పక్క రాష్ట్రంలో సికింద్రాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంటుకు తగినన్ని వ్యాగన్లు కేటాయించాలి
వైజాగ్ స్టీల్ ప్లాంటుకు డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాగన్లు అందుబాటులో  లేకపోవడంతో బొగ్గు సరఫరాలో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. తద్వారా ఉత్పత్తి కుంటుపడుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. వ్యాగన్ల కొరత కారణంగా మహానది కోల్ ఫీల్డ్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు తగినంతగా బొగ్గు సరఫరా చేయలేక పోతున్నారు. ఫలితంగా స్టీల్ ప్లాంటులో ఒక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మూసివేయాల్సి వచ్చింది. దీనివలన ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. సాలీనా 28 వేల కోట్ల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలనుకోవడం సరికాదని ఆయన అన్నారు. లాభాల బాటలోనున్న సంస్థలు ప్రైవేటు పరం చేయకూడదన్నది బీజేపీ ప్రభుత్వం విధానం అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయాలనుకోవడం శోచనీయని అన్నారు.

రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాల ఖాళీలు
రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. 2020-21లో 9529 ఖాళీలు భర్తీ చేయగా 2021-22లో 10637 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. ఈ లెక్కన మొత్తం ఖాళీలు భర్తీ చేయడానికి 30 ఏళ్ళు పడుతుంది. 2019లో రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తు రుసుం రూపంలో రైల్వే శాఖకు 864 కోట్ల ఆదాయం చేకూరింది. 2019లో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ నేటి వరకు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారని  రైల్వే మంత్రిని ప్రశ్నించారు. యూపీఎస్సీ మాదిరిగా రైల్వేలో కూడా ఉద్యోగాల భర్తీ నిర్ణీత కాలంలో ప్రతి సంవత్సరం జరగాలని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు.

మహిళల భాగస్వామ్యం పెరగాలి
రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని విజయసాయి రెడ్డి సూచించారు. లాజిస్టిక్ రంగంలో 20% మంది మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారు. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారిలో మహిళలు కేవలం 1 శాతం మాత్రమే. రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు.

సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీలు భర్తీ చేయాలి
సెంట్రల్ యూనివర్శిటీల్లో ఏర్పడ్డ ఖాళీలు యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు. దేశంలో కేంద్ర విద్యా శాఖ పరిధిలో ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 4వ తేదీలోపు ఈ ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర విద్యా శాఖ కోరింది. నిర్దేశించిన సమయంలో ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement