సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ ఆస్తులపై ఫిర్యాదు దాఖలైంది. ఆయన కుటుంబ ఆస్తులు, కంపెనీల ఆదాయంపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్‌ఓసీ)కు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. అమాంతంగా పెరిగిన చంద్రబాబు కుటుంబ ఆస్తులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెరిటేజ్ ఫ్రెష్‌కు చెందిన 14 కంపెనీల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ద్వారా దర్యాప్తు జరిపించాలని రామారావు తన ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు స్వీకరించిన ఆర్‌ఓసీ తదుపరి చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది.
దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ఆస్తులు రూ. 177 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులు కేవలం రూ. 34 లక్షలు మాత్రమేనని ఆయన కుమారుడు నారా లోకేశ్ గతంలో ప్రకటించారు. తనకు రూ. 25.25 కోట్లు, బ్రాహ్మణి ఆస్తి రూ. 25 కోట్లు, తల్లి భువనేశ్వరి పేరుతో రూ. 25 కోట్ల ఆస్తులున్నట్టు వెల్లడించారు. విచిత్రం ఏమిటంటే చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో మాత్రం రూ. 11.54 కోట్ల ఆస్తులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment