నంద్యాలలోని విజయ డెయిరీ ప్లాంట్
నంద్యాల/బొమ్మలసత్రం: విజయ డెయిరీలో పా‘పాలు’ ఎక్కువయ్యాయి. అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయ డెయిరీ పాలకవర్గం చైర్మన్‌గా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న భూమా నారాయణరెడ్డికి అవినీతి ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కన్పిస్తోంది. బంధు ప్రీతితో నిబంధనలను తుంగలో తొక్కి సమీప బంధువులకు చెందిన జగత్ డెయిరీకి సహకరించడం, ఆ సంస్థకు భారీ మొత్తాలను అడ్వాన్స్‌గా ఇవ్వడం, నాణ్యత లేని పాలను కొనుగోలు చేయడం వంటి అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, వాహన యజమానులు, ప్రైవేటు డెయిరీల నిర్వాహకుల నుంచి కమీషన్లు తీసుకోవడం వంటి ఆరోపణల కారణంగా చైర్మన్‌తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరెడ్డి కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
అవినీతి అక్రమాలపై విచారణ
విజయ డెయిరీలో సాగిన అవినీతి అక్రమాలపై ఆ సంస్థ డైరెక్టర్ వెంకట రామారెడ్డి, పలువురు కార్మికులు.. సహకార శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) ఎండీ వాణీమోహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె విచారణకు ఆదేశించారు. సహకార శాఖ కర్నూలు జిల్లా అధికారి రామాంజనేయులుతో సహా ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే సంస్థకు చెందిన కీలక రికార్డులు, క్యాష్ బుక్‌లు, బిల్లు బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
పాతికేళ్లుగా ఆయనే..
విజయ డెయిరీకి 1995 నుంచి ఇప్పటి వరకు భూమా నారాయణరెడ్డే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. డెయిరీ పాలకవర్గంలో 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఏటా ముగ్గురు డైరెక్టర్లు పదవి నుంచి వైదొలుగుతారు. వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకుంటారు. ఈ 15 మంది డైరెక్టర్లు కలిసి చైర్మన్‌ను ఎన్నుకుంటారు. డైరెక్టర్లు అధిక శాతం భూమా నారాయణరెడ్డి సన్నిహితులే ఎన్నికవుతూ వస్తున్నారు. దీనివల్ల ఆయనే చైర్మన్ అవుతున్నారు. అధిక శాతం డైరెక్టర్లు చైర్మన్ మనుషులే కావడంతో పాలకవర్గంలో ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఎవరూ అడ్డు చెప్పలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇటీవల పదవీ విరమణ పొందిన మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరెడ్డికి మరో రెండేళ్ల కాల పరిమితి పెంచుతూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం పలు విమర్శలకు తావిచ్చింది. ఈ విషయంలో కొందరు డైరెక్టర్లు, కార్మికులు చైర్మన్‌కు ఎదురుతిరగడం, వీరు పై స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో విజయ డెయిరీ వ్యవహారాలు రచ్చకెక్కాయి.
కార్మికులు, డైరెక్టర్లు ఫిర్యాదులోపేర్కొన్న అంశాలివీ..
♦ చైర్మన్ భూమా నారాయణరెడ్డి తన బంధువులకు చెందిన జగత్ డెయిరీ నుంచి నాణ్యత లేని పాలను కొనుగోలు చేస్తూ.. ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. పైగా జగత్ డెయిరీకి భారీ మొత్తాలను అడ్వాన్స్ రూపంలో చెల్లించారు. వాస్తవానికి రూ.25 వేలు దాటితే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలి. కానీ అలా చేయలేదు. జగత్ డెయిరీ ఇప్పటికీ విజయ డెయిరీ కి దాదాపు రూ.80 లక్షల బకాయి ఉంది.
♦ చైర్మన్ తన భార్య పేరుపై ఉన్న ఏపీ21సీక్యూ 1449 వాహనాన్ని సొంతానికి వాడుకుంటూ సొసైటీ ద్వారా బాడుగ చెల్లిస్తున్నారు.
♦ బైలా 27.1 ప్రకారం డైరెక్టర్లు వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరయితే పదవి కోల్పోతారు. కానీ ప్రస్తుత డైరెక్టర్ పద్మావతి వరుసగా మూడు సమావేశాలకు హాజరు కాకపోయినా కొనసాగిస్తున్నారు.
♦ విశ్రాంత ఉద్యోగుల గ్రాట్యుటీ నుంచి రెండు శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీల నుంచి పాలు కొనుగోలు చేస్తూ.. తమ బినామీల ద్వారా కమీషన్ తీసుకుంటున్నారు.
♦ గతంలో నంద్యాల విజయ డెయిరీ రోజూ 1.30 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేది. ప్రస్తుతం 30 వేల లీటర్లు మాత్రమే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తోంది. తద్వారా చైర్మన్ బంధువులకు చెందిన జగత్ డెయిరీకి పరోక్షంగా సహాయపడుతున్నారు.
♦ భూమా నారాయణరెడ్డి సన్నిహితుడు గోపాల్‌నాయక్‌కు హెవీ మోటార్ లైసెన్స్ లేకున్నా ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌లో కొనసాగిస్తున్నారు. అతని ద్వారా తక్కువ నాణ్యత కలిగిన స్పేర్‌పార్ట్స్‌ను కొనుగోలు చేయిస్తున్నారు.
♦ ఎండీ ప్రసాదరెడ్డి మనవడు చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీసును కర్నూలులోని విజయ డెయిరీ సొసైటీ గెస్ట్‌హౌస్‌లో 19–08–2019 నుంచి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్నీచర్, ఖర్చులు డెయిరీ ద్వారానే సమకూరుస్తున్నారు.
♦ కొందరు ఉద్యోగులకు అధిక జీతాలు చెల్లిస్తూ లంచాలు తీసుకుంటున్నారు. అవుకు శివకుమార్ అనే వ్యక్తి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో పని చేస్తూ చాలా కాలం క్రితమే ఉద్యోగం వదిలేశారు. కానీ ఇప్పటికీ రిజిష్టర్‌లో పేరు ఉంది.
విచారణ కొనసాగుతోంది
విజయ డెయిరీలో అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ కొనసాగిస్తున్నాం. కీలకమైన రికార్డులు, క్యాష్‌బుక్‌లు, బిల్ బుక్‌లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నాం. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు విచారణ వేగవంతం చేశాం. –రామాంజనేయులు, జిల్లా సహకార శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment