జిల్లాలోని ఏ గడపకు వెళ్లినా అధికార పార్టీ నేతల నిర్వాకంపై వైఎస్సార్‌సీపీ నేతలకు ఫిర్యాదులు
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలోని ఏ గడపకు వెళ్లినా అధికార పార్టీ నేతల నిర్వాకంపై వైఎస్సార్‌సీపీ నేతలకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి గద్దెనెక్కించామనీ... ఇప్పుడు ఆ పాలకుల నిజస్వరూపం చూసి పశ్చాత్తాప పడుతున్నామని చెబుతున్నారు.
అర్హులైన వారికీ నిబంధనలను కుంటిసాకులుగా చూపి ఇబ్బందులు పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, పాలకపక్ష నేతలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వివరించేందుకు చేపట్టిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం మంగళవారం ఐదవ రోజుకు చేరుకుంది. ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనతో జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు తదితరులు పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం తుంబలి మధుర గ్రామాలైన చినతుంబటి, గంగంపేట ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పుష్ఫశ్రీవాణి, రాష్ట్ర యువజన విభాగం ప్రధానకార్యదర్శి పరీక్షిత్‌రాజు పాల్గొన్నారు.
పార్వతీపురం మండలం బుదురువాడ పంచాయతీలోని బిత్రడొంగి, టేకులోవ, సంగందొరవలస, టొంకి, కాపుటొంకి, జిల్లేడువలస గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి జమ్మాన ప్రసన్నకుమార్ పాల్గొనగా, ఎస్‌కోటలోని శ్రీనివాసకాలనీలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నాయుడుబాబు. బాడంగి మండలం లక్ష్మీపురంలో తూముల రాంసుధీర్, దత్తిరాజేరు మండలం పోరలిలో నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.