చివరిచూపు దక్కేనా..
రుద్రవరం : కుటుంబ భారంమోస్తూ అన్ని విధాలుగా అండగా ఉండే తమ కుమారుడు ప్రహ్లాదుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై చివరి చూపుకు కూడా నోచుకోలేక పోతున్నామని ఆలమూరు గ్రామానికి చెందిన కొర్రె పెద్ద నాగిశెట్టి, లక్ష్మీ నర్సమ్మ, అక్కా చెల్లెళ్లు నాగలక్ష్మి,లక్ష్మిదేవిలు కన్నీరుమున్నీరు అయ్యారు. దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియ గురువారం గ్రామంలోని బాధితుడికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించింది.
ఈ సందర్భంగా వారు తమ బాధ్యను వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న టూర్ ప్లాన్‌లో మామ మురళిని కలిశాడు. విద్యార్థులు తక్కువగా హాజరు కావడంతో తోడుగా ఉంటాడని మామ తనను తీసుకెళ్లాడన్న విషయం ప్రహ్లాదుడు ఈ నెల ఒకటో తేదీ ఢిల్లీ నుంచి ఫోన్‌లో తమకు సమాచారం అందించాడని కుటుంబసభ్యులు తెలిపాడు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది సమీపంలో రోడ్డుపై బస్సు వద్ద మామ మురళితో ప్రహ్లాదుడు ఉండగా విద్యార్థులు నదిలో ఆడుకుంటూ, ఫొటోలు దిగుతున్నారని నదిలో నీటి ప్రవాహం పెరగడంతో సమాచారం తెలియజేసేందుకు వెళ్లి ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చే క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుక పోయి గల్లంతు అయ్యాడని తల్లిదండ్రులు వివరించారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: భూమా అఖిల ప్రియ
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నాన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెప్పమన్నాడని తెలిపింది. బాధితుడి బంధువులు, గ్రామస్తులతో జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ రుద్రవరం మండల ఇన్‌చార్జి పత్తి సత్యనారాయణ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రహ్లాదుడు గల్లంతైన విషయం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి నాన్న భూమా నాగిరెడ్డి తీసుకెళ్లాడన్నారు.
భాదితుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం సరిపోదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వత్తిడి పెంచి సాయం పెంచేలా కృషి చేస్తాడని చెప్పింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రూ.1.50 లక్షల తక్షణ ఆర్థికసాయం ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన రూ.5లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించే ఆర్థికసాయం భాదిత కుటుంబానికి అందేటట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీవీ రామిరెడ్డి, బంగారు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.