ఉద్యోగం రాలేదన్న బెంగతో.. యువకుడి బలవన్మరణం
పాణ్యం: ఉన్నత విద్యనభ్యసించిన ఓ యువకుడు ఉద్యోగం రాలేదన్న బెంగతో మనస్తాపానికి గురై బలవన్మరణం చెందిన సంఘటన కొణిదేడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, చిన్న బాలసుబ్బన్న ఏకైక కుమారుడు మిడుతూరి మహేష్(27) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేష్ ఎస్వీ యూరివర్సిటీలో పీజీ పూర్తి చేసి రెండేళ్ల నుంచి ఉద్యోగ వేటలో పడ్డాడు.
అయితే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో రెండు నెలలుగా మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి భోజన సమయంలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా తండ్రి నడిపి చిన్న బాలసుబ్బన్న ధైర్యం చెప్పాడు. త్వరలోనే ఉద్యోగం వస్తుందిలే..బుద్ధిగా చదువుకో అని హితబోధ చేశాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ ఇంట్లో రాత్రి భోజనం చేయకుండా దిగాలుగా గడిపాడు.
బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన తన సోదరి చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో మెడకు బిగించుకున్న తాడును తొలగించి చికిత్స నిమిత్తం శాంతిరాం ఆసుపత్రికి తరలించే లోపే మహేష్ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ మన్మద విజయ్ తెలిపారు. మృతుడి తండ్రి బాలసుబ్బన్న డోన్ ఆర్టీసీ డిపోలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు.