ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వర విశాల సహకార పరపతి సంఘంలో సహకారశాఖ అధికారులు మంగళవారం రహస్య విచారణ చేపట్టారు.
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వర విశాల సహకార పరపతి సంఘంలో సహకారశాఖ అధికారులు మంగళవారం రహస్య విచారణ చేపట్టారు. సంఘంలో అవకతవకలు జరిగాయని సంఘ సభ్యులైన కొందరు రైతులు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో విచారణ చేస్తున్నారు.
ఉచితంగా వచ్చినా డబ్బు నొక్కేశారా?
సొసైటీ పరపతేతర వ్యాపారంగా కొన్నేళ్లుగా పెట్రోల్ బంకును నిర్వహిస్తోంది. భూగర్భంలో ఉండే ట్యాంకర్ నుంచి సుమారు 13వేల 500 లీటర్ల పెట్రోల్ లీకైపోయిందని సిబ్బంది లెక్కల్లో చూపినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయిల్ ట్యాంకరు మార్చాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)ను కోరటంతో వారు ట్యాంకరు, పెట్రోల్ పంపు కూడా అందజేశారు. ఏ బంకుకైనా సంబంధిత ఆయిల్ కంపెనీలు వాటిని ఉచితంగా అందజేస్తాయి.
ఉచితంగా ట్యాంకరును, పంపును అందుకున్నా సొసైటీ లెక్కల్లో మాత్రం ట్యాంకుకు రూ. 8.60 లక్షలు, ఆయిల్ కొట్టే పంపుకు రూ. 1.92 లక్షలు మొత్తం రూ. 10.52 లక్షల సొసైటీ సొమ్ముతో కొనుగోలు చేసినట్లు బిల్లులు పుట్టించారని సమాచారం. సొసైటీ నిర్వహిస్తున్న ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి 2011-2012 ఆర్థిక సంవత్సరానికి రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని లెక్కల్లో చూపినట్టు తెలిసింది. కమర్షియల్ సిలిండర్లను తక్కువ ధరకు విక్రయించడమే దీనికి కారణమనే సాకు చూపుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.ఇదిలా ఉండగా ఇద్దరు రైతులకు సంబంధించి లోన్ క్లియర్ కాకుండానే అయిపోయినట్టు ధ్రువీకరణపత్రాలు అందించినట్లు ఆరోపణ వచ్చింది.
గతంలోనూ ఇంతే
ఈ సొసైటీ దశాబ్దం క్రితం వరకు రాష్ట్రంలోని ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలిచింది. పరపతి, పరపతేతర వ్యాపారాల్లో అగ్రగామిగా ఉండేది. అనంతరం జరిగిన అవకతవకలతో సొసైటీ ప్రతిష్ట దిగజారింది. అప్పటి అవకతవకలపై అధికారులు 51, 52 విచారణ చేశారు. అయితే వాటి నివేదికల వివరాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. ప్రస్తుతం రైతులిచ్చిన ఫిర్యాదుపై చేస్తున్న విచారణ సంఘానికి మేలు చేకూరుస్తుందనేదీ అనుమానమే.
వివరాలు అడిగితే విచారణ అధికారి ఆగ్రహం
ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు వచ్చిన సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ తాను ఆడిట్ చే సేందుకు మాత్రమే వచ్చానని విలేకర్లకు చెప్పటం విశేషం. వివరాలు అడిగిన వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.