సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ఉత్తర్వులు జారీ చేసి, మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉన్న ఫైళ్లపై అయోమయ పరిస్థితి నెలకొంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆ ఫైళ్లకు ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందో, ఏది తిరస్కరిస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ఫైళ్లను ఆమోదం (రాటిఫికేషన్) కోసం గవర్నర్‌కు పంపనున్నారు. ఈమేరకు గవర్నర్ నరసింహన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కేబినెట్ ఉనికిలో లేనందున కిరణ్ నిర్ణయాల ఫైళ్లను కేబినెట్ తరఫున గవర్నర్ ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేస్తారు. అయితే కేబినెట్ ముందు పెట్టాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను మాత్రం తనకు పంపించవద్దని ఆదేశాల్లో గవర్నర్ స్పష్టం చేశారు. ఆ ఫైళ్లను తాత్కాలికంగా సస్పెన్షన్‌లో ఉంచాలని సూచించారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త కేబినెట్‌ల ఆమోదానికి వాటిని పంపాలని, ప్రస్తుతం వాటిని సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ విభాగానికి కూడా పంపవద్దని పేర్కొన్నారు. దీంతో గతంలో వచ్చిన అటువంటి ఫైళ్లను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ విభాగం ఇప్పుడు సంబంధిత శాఖలకు తిరిగి పంపిస్తోంది.