‘జగన్‌పక్షాన చేరిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరి కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారారు. రెండు పడవలపై ప్రయాణం ద్వారా పబ్బం గడుపుకొంటున్నారు.’
నక్కపల్లిన్యూస్‌లైన్: ‘జగన్‌పక్షాన చేరిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరి కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారారు. రెండు పడవలపై ప్రయాణం ద్వారా పబ్బం గడుపుకొంటున్నారు.’ అని డీసీసీబీ మాజీ డెరెక్టర్ వీసం రామకృష్ణ విమర్శించారు. ఆయన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన నక్కపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డిపైన, వైఎస్ కుటుంబంపైన నిజంగా అభిమానం ఉంటే హరి తన ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
పార్టీకి చెందిన15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా చేసినప్పుడే హరి కూడా పదవిని వదులుకుని ఉంటే జగన్ అభిమానులంతా ఆనందించేవారన్నారు. రాజీనామా చేయకుండా తాను జగన్ పక్షాన ఉంటానని, ఆయన రాజీనామా చేయమంటే చేస్తానని చెబుతూ మోసం చేశారని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా యూపీఏకి మద్దతు విషయంలో తన అభిప్రాయాన్ని జగన్ అభిప్రాయంగా ప్రకటించి కార్యకర్తలను గందర గోళానికి గురిచేశారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై తర్వాత ఆలోచిస్తామని మాత్రమే జగన్ అన్నారని, ఫలానా పార్టీకి మద్దతు ఇస్తామని జగన్ ఏనాడూ చెప్పలేదన్నారు. హరి విషయంలో తమపార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి కార్యక ర్త స్వాగతిస్తున్నారని చెప్పారు. నాయకులెవరైనా అధినేత ఆదేశాల కనుగుణంగానే నడచుకోవాలని చెప్పారు. క్రమశిక్షణ తప్పిన వారికి ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.