
'ఎమ్మెల్యే అండతోనే మైనింగ్ మాఫియా'
కృష్ణాజిల్లా : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అండతోనే టీడీపీ నాయకులు మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ధనాన్ని అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నా రెవెన్యూ యంత్రాంగం కళ్లు కనిపించటం లేదా ? అని ప్రశ్నించారు.
చిక్కవరం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో తొలగించిన విగ్రహాలను తిరిగి నెలకొల్పే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అండదండలతోనే టీడీపీ నేతలు విగ్రహాలను తొలగించారన్నారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. గత రెండురోజుల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని పద్మశ్రీ చెప్పారు.