దెహ్రాదూన్: నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. అయితే, నేరస్థులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే మర్డర్ కేసు నమోదైన అరుదైన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. మైనింగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేశారు. వారిపై హత్య కేసు సైతం నమోదు చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన ఐదుగురు పోలీసులు మైనింగ్ మాఫియాను పట్టుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని జాస్పూర్‌కు వెళ్లారు. రూ.50,000 రివార్డ్ ఉన్న వాంటెడ్ క్రిమినల్ జాఫర్.. జాస్పూర్‌లోని భుల్లార్ అనే వ‍్యక్తి ఇంటిలో ఉన్నట్లు తెలిసి.. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, మైనింగ్ ముఠా మధ్య ఎన్‌కౌంటర్ మొదలైంది. ఈ ఎదురుకాల్పుల్లో స్థానిక బీజేపీ నేత గుర్తాజ్ భుల్లార్ భార్య గుర్‌ప్రీత్ కౌర్ ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పోలీసులకు సైతం తూటాలు తగిలాయి. బీజేపీ నేత భార్య మృతితో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ వెళ్లిన ఐదుగురు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులపై హత్య కేసు సైతం నమోదైంది.
‘రూ.50వేల రివార్డ్ ప్రకటించిన వాంటెడ్ క్రిమినల్ కోసం వెతుకుతున్నాం. భరత్‌పుర్ గ్రామం నుంచి తప్పించుకుని పోయాడు. మా పోలీసు బృందం అక్కడికి వెళ్లిన క్రమంలో వారిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. ప్రస్తుతం ఐదుగురు పోలీసులు చికిత్స పొందుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం వేట కొనసాగుతుంది.’ అని మొరదాబాద్ సీనియ్ పోలీసు అధికారి షలాబ్ మథూర్ తెలిపారు.
ఇదీ చదవండి: హిజాబ్ తీర్పు: సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం
Comments
Please login to add a commentAdd a comment