కర్నూలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు పలువురు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నారు. కర్నూలులో ఓటమిపాలైన టి.జి.వెంకటేష్ అధికార దాహంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను టీడీపీలో చేర్పించి అధినేత వద్ద తన ప్రతిష్టను పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ప్రతిసారీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ విడత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు.
పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ఊహించని విధంగా ఓట్లు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన కోట్ల తన స్వగ్రామం లద్దగిరికే పరిమితమయ్యారు. మారిన రాజకీయాల నేపథ్యంలో అధికార పార్టీలో ఉంటే తప్ప మనుగడ లేదని భావించిన ఆయన అనుచరులు కండువాలు మార్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా చిరకాల ప్రత్యర్థులతో చేతులు కలిపి అధికారం చెలాయించేందుకు కోట్ల ముఖ్య అనుచరగణం టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతోంది. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు, కోడుమూరు మాజీ మండలాధ్యక్షుడు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఈ విషయంలో ముందున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్న టీజీ ద్వారా టీడీపీలో చేరేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కోడుమూరు, వెల్దుర్తి మండలాల్లో కాంగ్రెస్ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. వీరిద్దరితో పాటు ఆయనను టీడీపీలో చేర్పించేందుకు టీజీ మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీల సహకారం ఎంతైనా అవసరం. అందుకోసం హర్షవర్ధన్‌రెడ్డిని టీడీపీలో చేర్పించేందుకు టీజీ హైదరాబాద్ స్థాయిలో పావులు కదుపుతున్నారు. పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెరుకులపాడు నారాయణరెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డితో పాటు టీజీ ఈ మేరకు మంతనాలు జరిపినట్లు వినికిడి.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా.. కోట్లకు ప్రధాన అనుచరుడైన కర్నూలు పట్టణానికి చెందిన రఘునందన్‌రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు టీజీ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలందరినీ టీడీపీలో చేర్పించడం ద్వారా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద తన పలుకుబడి పెంచుకోవడం టీజీ ఎత్తుగడగా తెలుస్తోంది. అయితే జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న కె.ఇ.కృష్ణమూర్తి కాంగ్రెస్ నేతల చేరికకు అడ్డుకట్ట వేస్తున్నట్లు సమాచారం.
జిల్లా కాంగ్రెస్‌కు దిక్కెవరు?
కేంద్ర మంత్రి పదవిలో ఉండగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇంట్లో జాతర వాతావరణం కనిపించేది. జిల్లా స్థాయి ఉద్యోగులు, పోలీసు అధికారులు.. చిరుద్యోగులు.. చోటామోటా నేతలు వరుసకట్టి ఆయన పిలుపు కోసం ఎదురుచూసిన సందర్భాలు కోకొల్లలు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ నివాసం నిర్జన ప్రదేశంగా మారిపోయింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ఒక్క శాసనసభ్యుడు కూడా ఎంపిక కాకపోవడం చూస్తే పునర్నిర్మాణంపై నేతల్లో సందిగ్ధం నెలకొంది. ఈ పార్టీలోని ముఖ్య నేతలు పలువురు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిపోవడం.. కోట్ల స్వగ్రామానికే పరిమితం కావడం కాంగ్రెస్ శ్రేణులను కలవరపరుస్తోంది.
అధికార దాహం!
Published Fri, Jun 6 2014 2:05 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement