T.G.venkatesh
-
అధికార దాహం!
కర్నూలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు పలువురు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నారు. కర్నూలులో ఓటమిపాలైన టి.జి.వెంకటేష్ అధికార దాహంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను టీడీపీలో చేర్పించి అధినేత వద్ద తన ప్రతిష్టను పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ప్రతిసారీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ విడత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ఊహించని విధంగా ఓట్లు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన కోట్ల తన స్వగ్రామం లద్దగిరికే పరిమితమయ్యారు. మారిన రాజకీయాల నేపథ్యంలో అధికార పార్టీలో ఉంటే తప్ప మనుగడ లేదని భావించిన ఆయన అనుచరులు కండువాలు మార్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా చిరకాల ప్రత్యర్థులతో చేతులు కలిపి అధికారం చెలాయించేందుకు కోట్ల ముఖ్య అనుచరగణం టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతోంది. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు, కోడుమూరు మాజీ మండలాధ్యక్షుడు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఈ విషయంలో ముందున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్న టీజీ ద్వారా టీడీపీలో చేరేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కోడుమూరు, వెల్దుర్తి మండలాల్లో కాంగ్రెస్ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. వీరిద్దరితో పాటు ఆయనను టీడీపీలో చేర్పించేందుకు టీజీ మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీల సహకారం ఎంతైనా అవసరం. అందుకోసం హర్షవర్ధన్‌రెడ్డిని టీడీపీలో చేర్పించేందుకు టీజీ హైదరాబాద్ స్థాయిలో పావులు కదుపుతున్నారు. పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెరుకులపాడు నారాయణరెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డితో పాటు టీజీ ఈ మేరకు మంతనాలు జరిపినట్లు వినికిడి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా.. కోట్లకు ప్రధాన అనుచరుడైన కర్నూలు పట్టణానికి చెందిన రఘునందన్‌రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు టీజీ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలందరినీ టీడీపీలో చేర్పించడం ద్వారా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద తన పలుకుబడి పెంచుకోవడం టీజీ ఎత్తుగడగా తెలుస్తోంది. అయితే జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న కె.ఇ.కృష్ణమూర్తి కాంగ్రెస్ నేతల చేరికకు అడ్డుకట్ట వేస్తున్నట్లు సమాచారం. జిల్లా కాంగ్రెస్‌కు దిక్కెవరు? కేంద్ర మంత్రి పదవిలో ఉండగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇంట్లో జాతర వాతావరణం కనిపించేది. జిల్లా స్థాయి ఉద్యోగులు, పోలీసు అధికారులు.. చిరుద్యోగులు.. చోటామోటా నేతలు వరుసకట్టి ఆయన పిలుపు కోసం ఎదురుచూసిన సందర్భాలు కోకొల్లలు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ నివాసం నిర్జన ప్రదేశంగా మారిపోయింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ఒక్క శాసనసభ్యుడు కూడా ఎంపిక కాకపోవడం చూస్తే పునర్నిర్మాణంపై నేతల్లో సందిగ్ధం నెలకొంది. ఈ పార్టీలోని ముఖ్య నేతలు పలువురు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిపోవడం.. కోట్ల స్వగ్రామానికే పరిమితం కావడం కాంగ్రెస్ శ్రేణులను కలవరపరుస్తోంది. -
టీజీ నిర్వేదం
కర్నూలు, న్యూస్‌లైన్: ఓటమితో టీడీపీ నేతల్లో నిర్వేదం నెలకొంటోంది. ఓటర్లకు పంపిణీ చేయమని అందించిన డబ్బు సక్రమంగా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమంటూ కర్నూలు నియోజకవర్గ ‘దేశం’ అభ్యర్థి టి.జి.వెంకటేష్ సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. నగరంలోని మౌర్యఇన్ హోటల్లో ఎమ్మెల్యే కార్యాలయం పేరిట సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాన్ని ఎత్తేసి అందులోని కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. ఇకపై సేవలకు స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వెలువడే చివరి నిముషం వరకు గెలుపు ఆశతో ఉన్న టీజీ.. ఫలితం ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో నగర ప్రజలు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.వి.మోహన్‌రెడ్డికి ప్రజలు పట్టంకట్టారు. ఓటమిని జీర్ణించుకోలేని టీజీ తీవ్ర నిర్వేదానికి లోనై తన పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులపైనా ఆగ్రహంతో ఊగిపోయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఈ ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారు. దాదాపు 25 మంది మాజీ కార్పొరేటర్లు టీజీకి అనుచరులుగా ఉన్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు వారికి భారీ మొత్తమే అందజేసినట్లు వినికిడి. అయితే అందులో సగం కూడా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి టీజీ వచ్చినట్లు ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే పాతబస్తీలోని నలుగురు మాజీ కార్పొరేటర్లపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కర్నూలు నియోజకవర్గంలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా 9 రౌండ్లలో ఎస్వీకి ఆధిక్యం లభించగా.. 7 రౌండ్లలో టీజీ ముందున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరులపై విచారణ జరిపించగా.. అక్కడ డబ్బు పంపిణీ జరగలేదనే విషయం బయటపడటంతో ఆయా ప్రాంతాల ద్వితీయ శ్రేణి నాయకులపై టీజీ మండిపడినట్లు సమాచారం. ప్రకాష్‌నగర్, ఎన్.ఆర్.పేట, బుధవారపేట, జొహరాపురం, గరీబ్‌నగర్, జమ్మిచెట్టు ప్రాంతం, గాంధీ నగర్, కప్పల్‌నగర్, డాక్టర్ గఫార్ వీధి ప్రాంతాల్లో ఎస్వీ కంటే టీజీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. 2, 3, 5, 8, 12, 13, 14 రౌండ్లలో మాత్రమే టీజీకి మెజార్టీ లభించింది. 1, 4, 6, 7, 9, 10, 11, 15, 16 రౌండ్లలో ఎస్వీ హవా నడిచింది. ఆయా ప్రాంతాల్లో డబ్బు ఎవరికి పంపిణీ చేశారు.. వారి జాబితాతో ఫోన్ నెంబర్లు ఇవ్వండి.. స్వయంగా నేనే మాట్లాడతానంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ కార్పొరేటర్లను టీజీ నిలదీస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొందరు కేబుల్ ఆపరేటర్లు కూడా డబ్బు సక్రమంగా పంపిణీ చేయలేదని అనుచరుల వద్ద మండిపడినట్లు సమాచారం. -
హడావుడి సృష్టిస్తున్న నాయకులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపోటములపై నేతల్లో గుబులు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మార్చి మొదటి వారంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చనే సంకేతాలు వెలువడటంతో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. అధికార పార్టీ నేతలు మరోసారి తమ సీటు పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రజల్లో పరపతి పెంచుకునేందుకు గీత దాటేందుకూ వెనుకాడటం లేదు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాల పేరిట హంగామా సృష్టిస్తున్నారు. గత వారం కర్నూలులో రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. అదే రోజు కల్లూరులో ఇంటి పట్టాలను కూడా పంపిణీ చేశారు. ఇకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఢిల్లీకి పరిమితమైన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సైతం ఇప్పుడిప్పుడే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. శనివారం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి వద్దే వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఇదేవిధంగా నాయకులంతా ఏదో ఒక రూపంలో ప్రజల ముంగిట వాలిపోతున్నారు. కార్యక్రమం చిన్నదైనా నలుగురు ప్రజలు కలుస్తున్నారంటే.. ఆ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం వారిని అడుగు బయటపెట్టనివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచేందుకు దాదాపుగా అభ్యర్థులు కరువయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చే నాయకుల కోసం ద్వారాలు తెరిచి ఉంచారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే వచ్చే వారు కూడా రారేమోననే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా అధికారుల్లోనూ ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చేలోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో పలువురు అధికారులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలమైన నాయకుల జాబితాను ఇప్పటికే ముఖ్యమంత్రి ముందుంచినట్లు చర్చ జరుగుతోంది. -
'వీహెచ్... ఓ కుప్పిగంతుల హన్మంతు'
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావుపై చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ శనివారం విజయవాడలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్రేతాయుగంలో రామభక్తుడు హన్మంతుడు భగవంతుడైతే నేటి హన్మంతరావు రాక్షసుడని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, అలాంటి ఆయన గురించి మాట్లాడే అర్హత కుప్పిగంతులు వేసే హన్మంతరావుకు లేదన్నారు. తమకు ఉరిశిక్ష వేసి అసెంబ్లీ చర్చ పెట్టమనడం పాల్గొనమనడం అన్యామన్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు అన్యాయం జరిగిందన్నారు. తాము ఇప్పటికి సమైక్య తీర్మానంపై ఓటింగ్‌కు కట్టుబడి ఉన్నామని టి.జి.వెంకటేష్ స్పష్టం చేశారు. -
2014 ఎన్నికల లోపు విభజన జరగదు: టీజీ
-
2014 ఎన్నికల లోపు విభజన జరగదు: టీజీ
రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ జీ వెంకటేష్ స్పష్టం చేశారు. అంతేకాదు దేశంలోని సగం రాష్ట్రాలు అంగీకరించాలని అన్నారు. అలాగే 371 (డి)ని సవరించాల్సిందేనని స్వయంగా భారత్ అటార్నీ జనరల్ స్పష్టం చేసిన సంగతిని ఈ సందర్బంగా టీజీ వెంకటేష్ గుర్తు చేశారు. 2014 ఎన్నికల నాటికి ఆ సవరణలన్ని జరిగే పని కాదని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరగదని టీజీ వెంకటేష్ స్ఫష్టం చేశారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్న వారే జీవితంలో అభివృద్ధి చెందుతారని రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. శుక్రవారం సి.క్యాంప్‌లోని లలిత కళాసమితి(టీజీవి కళాక్షేత్రం)లో డీఆర్డీఏ - మెప్మా సంయుక్తంగా రాజీవ్ యువకిరణాలు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్‌మేళా నిర్వహించాయి. అర్హులైన వారిని ఎంపిక చేసుకునేందుకు అపోలో ఫార్మసీ, బిగ్‌సీ మొబైల్, లెమన్ మీడియా, టాటా మోటార్స్, భారత్ మోటార్స్, గ్రూప్-4 సెక్యూరిటీ కంపెనీ మొత్తం 18 కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. సూపర్వైజర్, మార్కెటింగ్ మేనేజర్, పరిపాలనాధికారులు, కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ సూపర్వైజర్ తదితర ఉద్యోగాలలోకి తీసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు వె య్యి మంది యువతీయువకులు పాల్గొన్నారు. కష్టించేతత్వం ఉన్నవారికి అవకాశాలు అనేకం ఉన్నాయని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కష్టపడకపోతే ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారని, అభివృద్ధిలోకి రాలేరని తెలిపారు. రాజీవ్ యువకిరణాలు పథకం యువతకు ఉపాధి అవకాశాలను పెంచిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కర్నూలుకు వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలు రానున్నాయని, అందువల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయని పేర్కొన్నారు. యువతీ యువకులు వృత్తినైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు ప్రసంగించారు. వికలాంగులకు సదరం ధ్రువపత్రాల పంపిణీ... కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 480 మంది వికలాంగులకు సదరం ధ్రువపత్రాలను మంత్రి టి.జి.వెంకటేష్, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, జేసీ కన్నబాబు పంపిణీ చేశారు. సదరం సర్టిఫికెట్ల వల్ల బోగస్ వికలాంగులకు అడ్డుకట్ట వేసినట్లు అయ్యిందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్, మెప్మా పీడీ రామాంజనేయులు, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి, ఐకేపీ జాబ్స్ మేనేజర్ విజయకుమార్, మెప్మా లైవ్లీ ఉడ్ నిపుణుడు వెంకటేష్, డీపీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీజీ.వెంకటేశ్ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో బుధవారం సీఎంను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీఎంకు తెలిపానన్నారు. ప్రత్యేక రాష్ట్ర అంశం తెరమీదకు వచ్చిన తరుణంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌తో సహా కర్నూలు, కోస్తాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం తెలిపానన్నారు. జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర తరహాలు రెండు, మూడు రాజధానులుంటే తప్పులేదని టీజే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి నివేదిక ఇవ్వడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.