సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపోటములపై నేతల్లో గుబులు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మార్చి మొదటి వారంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చనే సంకేతాలు వెలువడటంతో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. అధికార పార్టీ నేతలు మరోసారి తమ సీటు పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రజల్లో పరపతి పెంచుకునేందుకు గీత దాటేందుకూ వెనుకాడటం లేదు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాల పేరిట హంగామా సృష్టిస్తున్నారు. గత వారం కర్నూలులో రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. అదే రోజు కల్లూరులో ఇంటి పట్టాలను కూడా పంపిణీ చేశారు. ఇకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఢిల్లీకి పరిమితమైన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సైతం ఇప్పుడిప్పుడే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
శనివారం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి వద్దే వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఇదేవిధంగా నాయకులంతా ఏదో ఒక రూపంలో ప్రజల ముంగిట వాలిపోతున్నారు. కార్యక్రమం చిన్నదైనా నలుగురు ప్రజలు కలుస్తున్నారంటే.. ఆ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం వారిని అడుగు బయటపెట్టనివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచేందుకు దాదాపుగా అభ్యర్థులు కరువయ్యారు.
కాంగ్రెస్ నుంచి బయటకొచ్చే నాయకుల కోసం ద్వారాలు తెరిచి ఉంచారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే వచ్చే వారు కూడా రారేమోననే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా అధికారుల్లోనూ ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చేలోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో పలువురు అధికారులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలమైన నాయకుల జాబితాను ఇప్పటికే ముఖ్యమంత్రి ముందుంచినట్లు చర్చ జరుగుతోంది.
హడావుడి సృష్టిస్తున్న నాయకులు
Published Sat, Jan 25 2014 12:46 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement