కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్న వారే జీవితంలో అభివృద్ధి చెందుతారని రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. శుక్రవారం సి.క్యాంప్‌లోని లలిత కళాసమితి(టీజీవి కళాక్షేత్రం)లో డీఆర్‌డీఏ - మెప్మా సంయుక్తంగా రాజీవ్ యువకిరణాలు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్‌మేళా నిర్వహించాయి. అర్హులైన వారిని ఎంపిక చేసుకునేందుకు అపోలో ఫార్మసీ, బిగ్‌సీ మొబైల్, లెమన్ మీడియా, టాటా మోటార్స్, భారత్ మోటార్స్, గ్రూప్-4 సెక్యూరిటీ కంపెనీ మొత్తం 18 కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. సూపర్‌వైజర్, మార్కెటింగ్ మేనేజర్, పరిపాలనాధికారులు, కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ సూపర్‌వైజర్ తదితర ఉద్యోగాలలోకి తీసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
దాదాపు వె య్యి మంది యువతీయువకులు పాల్గొన్నారు. కష్టించేతత్వం ఉన్నవారికి అవకాశాలు అనేకం ఉన్నాయని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కష్టపడకపోతే ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారని, అభివృద్ధిలోకి రాలేరని తెలిపారు. రాజీవ్ యువకిరణాలు పథకం యువతకు ఉపాధి అవకాశాలను పెంచిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కర్నూలుకు వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలు రానున్నాయని, అందువల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయని పేర్కొన్నారు. యువతీ యువకులు వృత్తినైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు ప్రసంగించారు.
వికలాంగులకు సదరం
ధ్రువపత్రాల పంపిణీ...
కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 480 మంది వికలాంగులకు సదరం ధ్రువపత్రాలను మంత్రి టి.జి.వెంకటేష్, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, జేసీ కన్నబాబు పంపిణీ చేశారు. సదరం సర్టిఫికెట్ల వల్ల బోగస్ వికలాంగులకు అడ్డుకట్ట వేసినట్లు అయ్యిందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నజీర్ సాహెబ్, మెప్మా పీడీ రామాంజనేయులు, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి, ఐకేపీ జాబ్స్ మేనేజర్ విజయకుమార్, మెప్మా లైవ్‌లీ ఉడ్ నిపుణుడు వెంకటేష్, డీపీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.