
'సీఎంలు ఇద్దరూ ఇద్దరే... మోసగాళ్లు'
హైదరాబాద్: అటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు ఇద్దరు ఇద్దరే మోసగాళ్లని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాజయ్యలు ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రుణమాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్... తర్వాత అధికారాన్ని చేపట్టి విడతల వారీగా రుణమాఫీ చేస్తానని ప్రకటించి ప్రజలను మోసం చేయడమేనని వారు విమర్శించారు.
అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు మండలాలపై అనుసరిస్తున్న వైఖరిపై కూడా వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఛత్తీస్గఢ్లో తిరిగే ఓపిక ఉన్న చంద్రబాబుకు... ముంపు మండలాల్లో ప్రజలు పడుతున్న బాధలు ఎందుకు కనిపించడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అటు తెలుగువాళ్లను, ఇటు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ముంపు మండలాల్లో ఉన్న ప్రజలు ఎందుకు గుర్తు రావడం లేదని చంద్రబాబును కాంగ్రెస్ నేతలు పొంగులేటి, రాజయ్య డిమాండ్ చేశారు.