
కేసులతో వేధించినా ప్రజలకు దూరం చేయలేరు
ప్రజాభిమానం చూరగొన్న నేతలను కేసులతో వేధించినా ప్రజల హృదయాల్లోంచి వారిని దూరం చేయలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తే కేసులతో బెదిరిస్తోంది: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజాభిమానం చూరగొన్న నేతలను కేసులతో వేధించినా ప్రజల హృదయాల్లోంచి వారిని దూరం చేయలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న వారిని కేసులు, విచారణల ద్వారా అడ్డుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందా? లేక రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకా? అని ప్రశ్నించారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ, ఎస్‌పీ అధ్యక్షుడు ములాయంసింగ్‌తో పాటు పలువురిని వేధించడం ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. మహిళా రాజ్యాధికార సంఘం నాయకురాలు ఆకుల లలిత, ఆమె భర్త మోహన్‌రెడ్డి, సీమాంధ్రకు చెందిన యువపారిశ్రామిక వేత్తలు వల్లభనేని ఆశాకిరణ్, కండ్లగుంట్ల శ్రీనివాసరావు, పి.గోపీకృష్ణ, పలువురు నాయకులు శుక్రవారం కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల మాజీ సైనికుల సభలో మోడీతో కలిసి వేదిక పంచుకున్నందుకే ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్‌పై కాంగ్రెస్ విచారణకు ఆదేశించిందని చెప్పారు. తెలంగాణపై బీజేపీ యూటర్న్ తీసుకోలేదని టీ టర్న్ తీసుకుందన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే తీవ్రవాదం తొలగిపోతుందని బండారు దత్తాత్రేయ చెప్పారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారని సీహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. కార్యక్రమంలో డా.లక్ష్మణ్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎస్.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మహిళా మోర్చా, కిసాన్‌మోర్చా భేటీలకు కూడా కిషన్‌రెడ్డి హాజరయ్యారు. వచ్చే నెలలో మహిళా మోర్చా రాష్ర్ట కార్యవర్గ భేటీ జరపాలని నిర్ణయించారు. ఇలా ఉండగా ఎవరె న్ని అసత్య ఆరోపణలు చేసినా తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ వెనకడుగు వేయబోదని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు టి.రాజేశ్వరరావు, ఎన్.వేణుగోపాలరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.