మోదీ సభ నుంచే బీజేపీ శంఖారావం
బీజేపీఎల్పీ పక్షనేత జి.కిషన్ రెడ్డి
శంషాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై పోరాటానికి ఈ నెల 7న జరిగే మోదీ సభలో బీజేపీ శంఖారావం పూరిస్తుందని ఆ పార్టీ శాసనసభా పక్షనేత జి.కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పాలనతో రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యమైందన్నారు. వర్సిటీలకు వీసీల నియామకం, ఎంసెట్-2 లీకేజీ వ్యవహారాలతో ప్రభుత్వ తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఉద్యమానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాయకులను చేర్చుకుని పదవులు కట్టబెట్టి, ఉద్యమకారులకు అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం చేయడంతోపాటు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు.