
'రాష్ట్రంతో చదరంగం ఆడుకుంటున్నారు'
చిత్తూరు : రాష్ట్ర విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ నీరు దొరకని పరిస్థితి తలెత్తుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆయన సోమవారం నీరుగట్టువారిపల్లెలో ప్రసంగించారు. విభజిస్తే రెండు రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. జరగబోయే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దామన్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్యే ఎన్నికలు జరగనున్నాయన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరిపారని జగన్ గుర్తు చేశారు. చేనేత కార్మికుల కోసం వైఎస్ రూ.320 కోట్ల రుణమాఫీ సంతకం చేశారన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఢిల్లీ పెద్దలు రాష్ట్రంతో చదరంగం ఆడుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని విద్యార్థులు...చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కాలర్ పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తీరు నీతిమాలిన విధంగా ఉందని జగన్ ధ్వజమెత్తారు. సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలది సమైక్యవాదం...మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ ప్లకార్డులతో నినాదాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.