విభజించు.. పాలించు | congress thinks towards rayala telangana | Sakshi
Sakshi News home page

విభజించు.. పాలించు

Published Sun, Dec 1 2013 1:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

విభజించు.. పాలించు - Sakshi

విభజించు.. పాలించు

రాయల తెలంగాణ దిశగా కాంగ్రెస్ అడుగులు
అలాగైతే మరికొన్ని ఓట్లు, సీట్లు వస్తాయనే ఆశ
రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అడ్డగోలుతనం
తెలంగాణ ముఖ్యులను ఒప్పించే యత్నాలు
అసెంబ్లీ అభిప్రాయాన్ని బూచిగా చూపుతున్న వైనం
కాంగ్రెస్, టీడీపీ నేతలకు దిగ్విజయ్ ఫోన్లు
దామోదరను పిలిపించుకొని మాట్లాడిన జైరాం
భేటీలో కొప్పుల రాజు, హోం శాఖాధికారులు
సోనియాతో ఆజాద్ భేటీ, రాయలపైనే చర్చ
7 లేదా 8 తేదీల్లో అసెంబ్లీకి బిల్లు: దామోదర
 
సాక్షి, న్యూఢిల్లీ:

ఓ నాలుగు ఓట్ల కోసం, మరో నాలుగు సీట్ల కోసం ఏం చేసేందుకైనా తాను వెనకాడబోనని ‘రాయల తెలంగాణ’ ప్రహసనం ద్వారా కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంటోంది. బ్రిటిష్ వారు అనుసరించిన ‘విభజించు-పాలించు’ సిద్ధాంతాన్ని రాష్ట్రంపై పదేపదే ప్రయోగిస్తోంది. కేవలం స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను కూడా చీల్చేందుకు తాజాగా రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో రానున్న సాధారణ ఎన్నికల్లో తనకు ఎన్నో కొన్ని ఓట్లు, కాసిన్ని సీట్లు ఎక్కువగా వస్తాయేమోనన్న ఆశే కాంగ్రెస్‌ను ఇందుకు పురిగొల్పుతోందన్నది సుస్పష్టం. అనంతపురం, కర్నూలు జిల్లాలను రాయలసీమ నుంచి విడదీసి, తెలంగాణ నేతలను ఎలాగోలా ఒప్పించి ఆ ప్రాంతంతో కలిపే దిశగా కాంగ్రెస్ పార్టీ శరవేగంగా అడుగులు వేస్తోంది. కానీ ఆ క్రమంలో రాయలసీమ వాసుల మనోభావాలు గానీ, శతాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న సీమ సమైక్య సంస్కృతి ఏమవుతుందన్నది గానీ ఆ పార్టీకి ఇసుమంతైనా పట్టడం లేదు. అసెంబ్లీ అభిప్రాయాన్ని బూచిగా చూపి తెలంగాణ నేతలను ఎలాగోలా ‘రాయల’కు ఒప్పించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రస్తుతం త్రీవంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇందుకు సహకరించేలా ఆ ప్రాంత నేతలందరినీ ఒప్పించే పనిలో పడ్డారు. ఇందుకోసం పార్టీ తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్రం తరఫున జీవోఎం కీలక సభ్యుడు జైరాం రమేశ్ రంగంలోకి దిగారు. అసెంబ్లీ అభిప్రాయం విభజనకు అడ్డంకేమీ కాకపోయినా, అది విభజనకు వ్యతిరేకంగా వస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందంటూ నేతలను వారు బుజ్జగిస్తున్నారు. అదే జరిగితే విభజనకు రాష్ట్రపతి కూడా అభ్యంతరం తెలిపే ఆస్కారమూ లేకపోలేదని చెబుతున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపే పక్షంలో రాయల తెలంగాణ, సీమాంధ్రల్లో 147 చొప్పున సమాన సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలుంటాయి. ‘‘16 మందిపై అనర్హత వేటుతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలను తీసేయగా సీమాంధ్రలో నికరంగా 131 మంది ఎమ్మెల్యేలే ఉంటారు. ఇక రాయల తెలంగాణలోని 147 మందిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, సమైక్యాంధ్రకే మద్దతిస్తారని భావించే మరికొందరిని తీసేసినా విభజనకు సానుకూలంగా ఉండేవారి సంఖ్య ఎలాగూ 131 కంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ ఘట్టాన్ని విజయవతంగా గట్టెక్కవచ్చు’’ అని తెలంగాణ నేతలతో కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీ నేతలతో దిగ్విజయ్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతుండగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో జైరాం ఢిల్లీలో ఇదే విషయమై శనివారం మంతనాలు జరిపారు. రాయల తెలంగాణకు మొదటి నుంచీ మద్దతిస్తున్న జీవోఎం సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ కూడా శనివారం సాయంత్రం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో ఈ విషయమై చాలాసేపు చర్చించినట్టు తెలుస్తోంది.
 
 తోసిపుచ్చిన దామోదర
 రాయల తెలంగాణకు టీ కాంగ్రెస్ నేతలను ఒప్పించడంలో భాగంగా దామోదరను జైరాం శనివారం ఉదయం తన కార్యాలయానికి పిలిపించుకొని 45 నిమిషాల పాటు చర్చించారు. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, మరో ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉమ్మడి రాజధాని పరిధి, భద్రాచలం అంశాలపైనా చర్చ జరిగింది. మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని రాయల తెలంగాణ ను ప్రతిపాదిస్తున్నట్టు జైరాం, రాజీవ్ శర్మ తెలిపినట్టు సమాచారం. ‘‘విభజన బిల్లును అసెంబ్లీకి పంపితే ముఖ్యమంత్రితో పాటు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ. బిల్లు సందర్భంగా రాజకీయ అనిశ్చితి నెలకొనేలా ఏం జరిగినా జాతీయంగా కాాంగ్రెస్‌కు చెడ్డపేరు తప్పదు. బిల్లు ప్రక్రియ సజావుగా సాగాలంటే కనీసం సీమలోని రెండు జిల్లాల ప్రజాప్రతినిధుల మద్దతు అవసరం. ఇక ఇరు ప్రాంతాల మధ్య కృష్ణా జలాల అంశం పరిష్కారానికి రాయల తెలంగాణ ఉత్తమ పరిష్కారం. కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న మైనారిటీ, ఎస్సీ ఓట్లు ఆ రెండు జిల్లాలో ఎక్కువ. ఇది కాంగ్రెస్‌కు అనుకూలించే అంశం’’ అని వారు వివరించినట్టు చెబుతున్నారు. కానీ వారి ప్రతిపాదనను దామోదర తోసిపుచ్చినట్టు తెలిసింది. అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపితే మళ్లీ ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం చెలాయిస్తుందని, అలా జరిగితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విలువే లేదని గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం డివిజన్‌లో ముంపుకు గురయ్యే గ్రామాలను సీమాంధ్రలో కలుపుతారని మొదటినుంచీ చర్చ జరిగినా, అలా ఏ గ్రామాన్నీ కలిపే ఉద్దేశం లేదని జైరాం చెప్పినట్టు తెలుస్తోంది. విభజన ముసాయిదా బిల్లును డిసెంబర్ 3న జీవోఎం మోదిస్తుందని, 4న కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెడతామని, ఆ వెంటనే రాష్ట్రపతికి, అటునుంచి 7 లేదా 8న అసెంబ్లీకి పంపిస్తామని దామోదరకు జైరాం స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అనంతరం జీవోఎం సభ్యుడు, రక్షన మంత్రి ఏకే ఆంటోనీని కూడా దామోదర కలిశారు.
 
 కాంగ్రెస్, టీడీపీ నేతలతో దిగ్గీ మంతనాలు...
 రాయల తెలంగాణకు మద్దతు కూడగట్టేందుకు టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు సహా టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలతో కూడా దిగ్విజయ్ మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అనివార్య పరిస్థితుల్లో రాయల తెలంగాణ వైపు అడుగులు వేయాల్సి వస్తోందని, దీనికి అంతా సహకరించాలని వారిని కోరుతున్నట్టు సమాచారం. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులకు దిగ్విజయ్ స్వయంగా ఫోన్లు చేసి రాయల తెలంగాణను ప్రస్తావించి మద్దతు కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కూడా ఆజాద్ శనివారం సాయంత్రం సోనియాతో భేటీ అయ్యారు. రాయల తెలంగాణకు సానుకూలంగా వాదించారనిచెబుతున్నారు.
 
 రాయలపైనా చర్చించాం: దామోదర
 జైరాంతో బేటీ అనంతరం దామోదర మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణకు ప్యాకేజీ, భద్రాచలం, పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితరాలపై చర్చించాం. రాయల తెలంగాణ కూడా చర్చకు వచ్చింది. అయితే దానిపై కేవలం చర్చలే జరుగుతున్నాయి తప్ప తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. మేం మాత్రం పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నాం. తెలంగాణ బిల్లు డిసెంబర్ 7న లేదా 8న అసెంబ్లీకి వస్తుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లుకు ఆమోదం లభిస్తుంది’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement